Kuchi has written nearly 300Telugu poetries And over 100 stories and memories in Telugu. He loves his mother tongue and its beauty, Finding identity in Telugu sahityam.
కవితలు
1.నేనింతాచేసి...ఓ రంగుల పక్షినై....!!

“కాలం కల్పనల చెట్టెక్కి…
నాగూడును నేనే శిల్ఫీకరించుకునే వడ్రంగి పక్షినినేను!
అనుభూతులేవో పుప్పొడిరాగాల సోయగాన్ని గొంతున మొలిపించి, మురిపిస్తుంటే….
రెక్కచాటు ఓపిక
సహస్రబాహువులతో తోడొస్తుంటే…
నా కళోద్దీపనం నన్ను నా మనసుతో రమింపజేస్తున్న ఉత్సాహంతో… ఒట్టు…
నా గూడు నేనే కట్టుకుంటున్నా!
అసలు విధివిదిల్చిన ఆనంతకోటి ప్రాణుల్లో
హవ్వ!ఎవరో తోరణం కట్టుకున్న చోటు నాకెందుకు!
కొంప కొంపా తిరిగి ఎంగిలి మెతుకుల కాకి బతుకై!
వాడిచ్చిన రెక్కల సౌరు,
వాడిచ్చిన ముక్కు మొనవాడి…
వాడు కరుణతో ఇచ్చిన గుండెకింద తడి…నా జీవికకు పరిమళాలను అద్దే పరాగరమణులై ఊడిగం చేస్తూ…
నన్ను అలరిస్తుంటే…
కదూ!నా ముక్కు కాంక్షాకైవారపు కుంచెగామారి….
కాలం చెట్టునే కళ్లకద్దుకు…కళాఖండంగా చిత్రిస్తున్నది!
ఎప్పుడైనా సరే…
ఏ వేళనైనా సరే…….
ఒకతార వయ్యారిగా నెలవంక పడవలోజేరి నీలిగగనాలలో విహరిస్తూ…
నా మనసుకు మంత్రోపదేశం చేస్తున్న ఆర్ద్ర ఘడియన…
నా రెప్పలవెనుక కలలోనేకదూ ఓ మంత్రనగరి ఉదయించేది!
అదిగో!
అందులో ఆమూల జేరి ఆశావేశ్య అరపైట సర్దుకుని మరీ నన్ను ఆహ్వానిస్తోంది!
పెదవి మునిపంట పిండి కవ్విస్తోంది!
నిజం!నన్ను కటాక్షిస్తోంది!
ఒక్క గుప్పెడు సాహసం చేయకపోతే…
అసాధారణ సృష్టికి ఆలంబన ఏది!
రేపటి బ్రతుకుపుస్తకాల కొత్తపేజీలమధ్య మెరిసే జీవికనెమలీకకు కొబ్బరి మట్టల లేతమేత… ఏదీ?
అడ్డవారుతూ..వెళుతూ.. కాంక్షాకాశ్మీరపు జలతారుదేహాల పచ్చి కన్నెపడుచుకదూ…
పాలకడలి పలకరింతతో..
చిటికెడు నక్షత్రధూళి నా మీద జల్లి….
కనుకొలకుల ఏటవాలు బాణం వేసి చక్కాపోతేనే…ఎదో…ఇలా…ఇప్పటికి…
ఈ మానససరోవరాల రాజహంసకు తామరతూళ్ల వైజయంతిమాల అందింది!
ఇదిగో!
ఇదే నా భూమికతలపై ఇంద్రధనువుల పాగాచుట్టి,
నా చేతకి సురసృజనల జండా ఇచ్చింది!
అందుకే…
ఎప్పుడెలా కాలాల సునామీకి తలవంచినా…ఆనక… నిశ్శబ్దపు ప్రవాహంలోంచి విశ్వవీణకు మూర్చనలను అందించే గొంతుతో…
ఇదిగో…ఇలా ఈ “గడ్డిపరక” తలెత్తే పొగరు!
ప్రవాహం నా గమనానికో రత్నకంబళి అనుకుంటూ అంగరంగవైభవాల ఆకాశాన్ని ఈదుకుంటూ….!
************
“కూచి”
చిత్రకారుడు
.అహో! రామబాణానికి అలసటా!
అపురూపమై వాల్మీకికవిచంద్రుని ఒడిలో రామకావ్యమేదో…..
తాళపత్రగతిలో మడతలు వేసుకుని
ఒద్దికగా పడుకున్నట్టు ఉన్న ఈ భంగిమ….
ఇదో రామనామపానగరిమ!
ప్రకృతిమాత అదృశ్య హస్తాల ఎనలేని సుఖస్పర్శ!
కార్యకారణజన్మకు… సేవాప్రతిన ఆలంబనగా..
యుగాల అలసట జగాన ఇసుమంతైనా…
మనసుకంటికి చిక్కని మాయలమత్తు!
రెప్పమూయని శరణాగతిగమ్మత్హు!
తనశక్తి తనకే ఎరుకవగా….. ఈ ఉబ్బులలింగాoశ…కి
అలుపు…అలసటా…
లంకకు జింకలా…
ఎగురు దూకుళ్ళ పరవళ్ళు కావూ!
పరవశసంగీత ‘హనుమత్తోడి” అమృతాలాపనల
గంధర్వగీతి కాదూ!
మైనాకుడో…సింహికో….
ఏ ప్రలోభం ఆపగలదీ జితేంద్రియత్వపు రామదూత
మహాసంకల్పాన్ని!
అసలు!
బ్రహ్మ మాట తలచుకునే… కేవలం బొమ్మకాపలాదారు
ఆంఖణాలలంఖిణీ జోతలు అందుకుని….
ప్రాకారాలు దూకే ఈ ఓంకారాoశునికి….
నిస్త్రాణ….
దీపశిఖనంటని
చీకటిజీమూతం ….!
సీతాన్వేషణ కర్తవ్యదీక్షకు పరీక్షపెడితే…
లక్షలఅక్షయుకుమారులు అడ్డుకోగలిగారా…
బ్రహ్మాస్త్రపు బులుగుతాడు ఆపిందా….!
తోకపార్వతి తోడుతో ఈ శివశంకరాంశ…
ఈ రామకార్యపరమహంస…
కనీసo మగతగా
కనురెప్పకొట్టడం….
అప్పుడు
అఖండ వారాసి ఎగసి చూసిందా?
స్వర్ణలంక చాటు మాటున పసిగట్టిందా? లేదే…
తోకచుట్ట సింహాసనాలoకృతుని….
ఈ పలికే రామలేఖని…
ఏ దశకంఠం శాసించింది…
ఏ గతిని బంధించగలిగింది!
చిన్ముద్రల హితోపదేశం
దశమస్తకాల సమస్త వీనులకు…అయ్యయ్యో!ఆఖరి విందుగా తోచడం…
అప్పుడే
“మన్నయ్యెను అయ్యో లంకా…” గీతపు ఆఖరు చరణo…. కాదా!
తోకరాయుని…
సరిజోడు ప్రళయకీలలు దోచుకుపోయే
లోహానిర్మిత లంకాపట్టణపు ఆఖరి శోభ కాదా!
ఒక్క మాట…
వాలకల్లోలాగ్నికీలలను లంకపై ఎగసందోసి…
వేడుకచూపి….
మితిమీరిన రావణగర్వంసర్వo కాలుతున్న లంకాగ్నుల హోమగుoడాన..సభక్తికంగా
పూర్ణాహుతి చేసిన ఈ మహామహిమల
మర్కటహేల
అయ్యహో!
అంతా కాల్చివచ్చి
ఆనక
శ్రమతెలియక
మరింతగా…సింహనాదాల సందోహంలో మునిగిఉండడం….
సీతను చూసిననాటి ఈ మహాకపి తక్షణ
ఆనంతానందపు శింశుపావృక్ష శాఖాచంక్రమణo……
రాక్షసకోటికి తెలిసొచ్చిన అగ్నిహోత్రునిఅంటకాగు ఫలితం కాదా!
ఆఖరుకు….
అమ్మసీత దీవెనతో….
మళ్ళీ ఈ రామబాణం వెనక్కొచ్చి.. రామపాదాన్ని ఆశ్రయించడం….
అమ్మో!చిటికెలో పనా.?
వక్కకొరికినంత సులువా.?
ఇది
రామస్వామి…ఆఏలుదొర వెన్నుదన్నుతో సుఖభోగమైన అనితరసాధ్యం!
రామునికి విషయం సాంతం వివరించి..దుఃఖం పోగొట్టిన
వెర్రిహనుమన్న,
అలసట ఆవహించిన ఈ శ్రీఆంజనేయం…
ఇదిగో…ఇలా…ఈ భంగిమలో….
ప్రకృతి మాత ఒడిలో…
లిప్తపాటు… నిద్రానందపుసౌందర్య మధురిమకు లోనవ్వడం…
బహుశా…
కళకళలకపర్ధిహాసకైలాసం వెన్నెల్లో కునుకుపడ్డట్టు కాదూ!
తదనంతర రామకార్యనిర్వహణకు రణన్నినాదంగా…
దిక్కుల దిగ్గజాలు దిగ్గురనగా
జయశంఖం పూరించడం కాదూ!
“రామోత్సాహం….”
జగతికి ఓ నవకళల
భవిష్యత్బ్రహ్మోత్సవం!”
************
“కూచి”
చిత్రకారుడు
"యోగా"
శరీరానికి….ఆత్మకి
ఆధ్యాత్మికారోగ్యపు మైపూత కదూ!
తిరోగమనాల జీవికకు
జీవనోత్సాహపు అమృతవిందులు అందించి….
గోరుముద్దై ఆనంతానందపు ఆశల బువ్వను అరణం చేసి…
నీ వ్యక్తిత్వపు శిఖరాన నిన్నే ఓ జండాచేసి గర్వంగా ఎగురవేసే…..అపూర్వ సచేతన కదూ!
“యోగా”…..మా బాగా!తెలుసా!
ఒక్కసారి మనోవికారాలను ఆవలపెట్టి ఆత్మాన్వేషణల బాటపట్టి
నీలోకి నువ్వే ఉన్నతమనస్కుడవై కుడికాలు పెట్టి….
అంతరాంతర సీమల, మారుమూలలకు
కర్తవ్యదీక్షతో…
చిత్తశుద్ధి చేయూతతో విజయ విహారివికా…..
బాహ్యాన్ని పడని అడుగేదో…
నీ అంతరాలయసీమన అలవోకగా పడాలని
గట్టిగా.. మా గట్టిగా…
జగజ్జెట్టిగా అనుకో….
నాటి “కలాం” కలలతీరాల ఊపిరులు ఉదాత్తంగా పీలుస్తూ….
పరిమళ తుఫానువై ఆనందాల …..అనుభవాల సత్యాన్వేషణ మొదలెట్టు…
ఏం “అమ్మపాల” ఋజువర్తన,
నిజాయితీ,స్వచ్ఛతే కదూ నీ ఉనికికి జేగంట…
ఆ నాదఝరేకదూ….నిన్ను మంత్రపూతం కావిస్తూ…
దేహదేవాలయాన ఆత్మ ప్రదక్షణలు చేయిస్తోంది….
నీ మొక్కవోని దీక్షకు అంతరాంతర జ్యోతిస్సీమల్ని
పరిచయం చేస్తోంది!
మనిషీ!
నీ ఈ పుట్టిననేల నీకు మహా
“యోగో”పదేశపు సార్ధకతను
దివ్యప్రసాదంగా అందిస్తోంది!
నీ దేహపు…సందేహపు మాపెద్ద,గొప్ప తాళానికి….
ఆపక్కనెక్కడో భద్రంగా భగవంతుడు చేర్చిపెట్టిన తాళంచెవి ఉనికిని అచ్చంగా చూపిస్తోoది!
నమ్ము!
నీ వైభవోత్సవపు జన్మజన్మల పూలతావి…
ఊటలని….
నీకు అందివచ్చే శుభసంకల్పాల,
శుభసూర్యోదయాల జాడగా…
నీలో…లోలో….
బహుదూరంగా శ్రీకారపు రహదారిదీపమై ఆహ్వానం పలికే శుభతరుణాన్నిఆoదిస్తోంది!
అబ్బో! నీ జన్మ యోగ్యతకు మణికిరీటం పెట్టడానికి
మరీ మరీ చేరబిలుస్తోంది..!
కన్నతల్లిలా ఈడేరేకలల కాంక్షా కాశ్మీరం కప్పడానికి
నిజం!నిన్ను తనలోకి ఆప్యాయతల ఆశాలవిందుతో నీ మనసు నింపడానికి…
దేవదేవుని పిలుపుతో….చేరబిలుస్తోంది….చేరదీస్తోంది………!
నీ ప్రస్తుతాల వర్తమానపు మనోజవపు మహాజీవికకు
మేటి కిరీటం మరోమారు పెట్టి…
విశ్వవేదికన నీ ఉనికికి మహోజ్వల పట్టాభిషేకం చేయించి…
నీమనిషి లోని మనీషిని మూర్తిమంతమైన
బహు “యోగ”త్వంగా
ప్రపంచ చరిత్రల బంగారుపేజీల్లో నిక్షిప్తo చేసేందుకు…
నడుం కడుతోంది..!
నీ అన్వేషణకు అందమైన
ఫలితాన్ని బంగారుకంచoలో పెట్టి
అందిస్తోంది!
రేపటి చరిత్రలోకి నిన్నో బంగారుపుటని చేస్తోంది! దీవిస్తోంది!”
*******
“కూచి”
చిత్రకారుడు
"ఏం! అందం నిదుర లేవకూడదా....”
“ఏం! అందం నిదుర లేవకూడదా….
పైగా నిన్నలేని అందం…!
నేడు….ఈనాడు….
ఈ కాలం జాలం చూసి….
రాత్రికన్న కలలను దిండు గలీబులోకి నెట్టి…
ఇప్పటికిప్పుడు…..
ఈ బ్రాహ్మీ లో…
తల గగనసీమలలోకి జండానుచేస్తూ….
తన పాదాక్రాంత అయిన ప్రపంచవింతల సంతల్లో… అడుగులేస్తూ
ఆహ్లాదాల గంగాబోండం నీళ్లు కొసరి కొసరి తాగుతూ…
ఆశల కొబ్బరిలౌజు ఆరారా చప్పరిస్తూ….
ఏం! నిన్నలేని అందమేదో…
లలలలాలలాలలా….
లేవకూడదా ఏవిటీ!
తెలుసు!
సంకెళ్లుపడ్డ అరిపాదాల అడుగుమడుగున
అమరిన దృశ్యాదృశ్య వైభవాలను నిశితంగా కొలుస్తూ… “త్రిపాది ఐ తిరిగే కన్నుల కలల అన్వేషణ వృధాకాదు…”
అని అంటూ… ప్రపంచవింతల….
అందాల ఆనందాలను మనసా నొల్లుకు మురిసిపోతూ….
అచ్చంగా!
నిన్నలేని అందమేదో…
హాయ్ హాయ్……!
అవును!
అప్పుడు అవనతమనస్కుడవై
చీకటిలోకాల చీకాకుల దుప్పటిలో తలను కళ్ళజోడుసహితంచేసి
ఉష్ట్రపక్షిల…మెడకంతా లోలోపలి.. లోపలి.. లోపలి…లో లో కి దూర్చి దూర్చి…
ఏమి కలకన్నావో….
నీకు ఈషన్మాత్రం గుర్తుకొచ్చి మురిపించిందా….?
అప్పటికీ జిగట చీకటి సంద్రాల వికటకెరటాల గాడిద సవారీ చేసి….
అయోమయపు దారుల్లో….నవ్విన
డికడెన్సుల సర్రియలిస్టు శిశువ్వి నువ్వు
నీ రూపురేఖల్ని చీకటికేన్వాసుపై రంగు అంటని కుంచెతో దిద్దాలనుకుని….ఆశపడి…
పెళుసు అలనవ్వుల తటపటాయింపులో విరిగిపడ్డ ఛిద్ర శంఖానివై…
నువ్వెప్పుడాతీరాల ధృతరాష్ట్ర కౌగిలిలోంచి విడివడి….
ఓ విద్యుల్లేఖలా…
గగనసీమల నీలిహాలులోకి తలెత్తాలీ!
ఎబ్బే!
కుదరదు…
నీ ఆశక్తదుర్జనత్వాల వీలుకాని చేతకు చైతన్యం అందదు!
ఇప్పటికి విధి లిఖించిన నీ విభూది గీతలలోని పస…
మెల్లగా ఫెడౌట్ అయ్యి….
చూశావా….జిగట కెరటాలు కౌగలింతలో ఛాయ కోల్పోతోంది!
ఐనా….ఎక్కడ…
భువనభవనాల అంచుల మూగిన మేఘాబాలల పసినవ్వుల పెదవంచుల గుభుక్కున మెరిసిన ఉషోదయ మంత్రాక్షరదీపికల మహిమోపేతపు వర్ణవైచిత్రుల నునువెచ్చని వెలుగుపువ్వుల కిరణం ఒక్కటి చాలదూ…
నీ సుప్తాశ్రువులు చెల్లిన కాలాన్ని
ఆశల కంచం ఆవలకు నెట్టేస్తూ….
అమృతోత్సవవిందుల పసందునొక్కటి…
నీ బుగ్గన మిఠాయి కిళ్ళీలా మార్చి…
మళ్ళీ మళ్ళీ నీచే…..
ఆవునోయ్! ఆశావహుడా
నీ చేతనే కొసరి కొసరి తినిపిస్తూ…
నీచేతనే ఉల్లాసాల అమృత వర్షిణిలో…..
జలక్రీడలు సాంతం ఆడించడానికి….
ఒట్టు!ఓలలాడించడానికి….
వేయి చెప్పాలా….
మనిషీ!
అవును!
అగుపించక దోబూచులాడే అమ్మప్రేమ హాయిహాయి స్థన్యాల పుణ్యాల సాక్షిగా….
నమ్ము!
“నిన్నలేని అందాన్నేదో…
మనోవాక్కాయకర్మన…
నిదురలేపు….”
దిగంతాలకు నీ చేతచూపే
జగజ్జెగీయమాన
వెండిజండాగా మారి
నవలోకకాంతుల తోరణాలతో….
ఆనంతానందపు బ్రహ్మోత్సవ రధంలా ఉసురుసురుగాళ్ళ దిష్టిగుమ్మడితలల్ని మట్టేస్తూ….ఆడుగెయ్యి…..
సురసంపెంగపూదారుల పున్నాగసన్నాయివై రాగరసజ్ఞత పంచుకో…
మళ్ళీ చెప్తున్నా…
రేపటి కీర్తి కాంతుల ఏకాంతాల రూళ్ళబుక్కు మొదటిపేజీపై
ఈడేరే ఆశలకు పసుపుపచ్చని శ్రీకారమైవెలిగిపో!
మమతల మనిషిని నేనని
నాలో…
నిన్నలేని అందమేదో…. నిదురలేచి చిందేస్తోందని…
కనీసం నీ మనస్సాక్షికైనా పోయి చెప్పుకో……..
నువ్ చేతలరాయుడినేననే కూచింత గుట్టు….
గర్వాన విప్పుకో!
************
“కూచి”
చిత్రకారుడు
“ఏముందనీ ప్రాణం గుక్కెడు....!”
ఏముందనీ ప్రాణం
గుక్కెడు….!
విధి వింతవికృత నవ్వులో
యముని మహిషపు లోహగంటల కిరాతక అపమృత్యునాదం
అదో మృత్యుపాశం!
అరే….
రేపటి ఆశాదీపాలేవో
అర్ధాoతరంగా
ఆకాశవీధిలో కొండెక్కిపోవడం…
గుండెలవిసే…..
మహా మారణం
విధివంచనకు ఇదో తిరుగులేని ఉదాహరణo!
“గుండెకింద చెమ్మ”
మనసొత్తని రొమ్మువిరచిమరీ మనమనుకున్నాం
వాడికసలు గుండె లేదని
ఈ ఘాతుకనిజాన్ని చూసి నమ్మిసొమ్మసిల్లిపోతున్నాం!
మనిషన్త మనిషేకాదు,
భూమ్మీద పిడికిడoత ఉయ్యాల మనిషీ…
ఈ ఘోరకలి దంతాలకి సానగామారి అరిగి,కరిగి
కాలిపోయి…..
ఇదేoటిలా భారతభారతికి పుట్టు గర్భశోకాన్ని మిగిల్చి చిచ్చుతెరల పరదాలెనుక రూపుబాసిపోయాడు…
తమవాళ్ళ ఎదురుచూపుల కనుపాపలనీలిహాల్లోకి
కర్ఖశమైన కార్చిచ్చులగన్దరగోళాల
చావుకబురునందించి హఠాత్తుగా అపమృత్యు స్పర్శల అగ్నికీలలకు ఆహుతైన సోదరులెవరూ!
అయ్యో….అయ్యయ్యో
ఏమనిషి ఏ మనిషిని
కలుద్దామనుకున్నాడో…
రెక్కలు కట్టుకు ఎగిరె ప్రియ సందోహాన్ని సంభ్రమం చేద్దామనుకున్నారో…
అమ్మ పాలుతాగి కన్నుమూసిన పసిగులాబీ
మంటలదుప్పటి కప్పుకుని
శాశ్వతనిద్రలోకి జారుకుందో…..
చెప్పలేని ఘోరకలి..!!!
కేరింతలు తుళ్ళింతల జీవికలెన్నో…లిప్తలో…
ఈ మృత్యువిహoగపు గర్భంలో చేరి….నిలువెల్లా పరశురామప్రీతి అయిపోడం
జాతికంట కన్నీటిస్పర్శ మొదలంతా ఇంకిపోయిన వైనం….
అయ్యో!
ఏ జన్మ పాపం….
ఏ ఓర్వలేని దాయాది అసహనాల అంతుచిక్కని శాపం!
ఆసేతుశీతాచలం అవిసేలా
అగ్నికీల అమాయకుల బ్రతుకునే పట్టి… సుడులు తిప్పి నిండా ఉసురు తీసిన వైనం
దేశపు గడపన తెగిపడిన మంగళతోరణo!
అర్ధాoతరంగా తెగిన విశ్వగురుని చేవీణ తీగ!
తల్లిభారతి కడుపులోకి కనికరం లేని కలికాలపురుషుడు పెట్టిన కొరకంచు!
ఏమి మిగిందని జాతిచేష్టకి…
నిర్లిప్తత దోచుకున్న చైతన్యవిహీనమైన స్మశాన నిశ్శబ్దాల ఓర్వలేని రాహుకాలంతప్ప!
కాలాలు మారినా
కేలoడర్ల పేజీలు రెపరెపాకొట్టుకు చిరిగి ఛిద్రం అయ్యినా…
ఇది జాతిజనుల కన్నూ, మనసూ మరువలేని విషాదనిషాదం!
కనపడని కాలo చేసిన తీరని మహామాయాజాలం…
మరువలేనిమారణహోమం
మందులకందని మహాగాయం!
ఐనా! కాలం జాతిమనసుకు
మరుపు పూతపూసే రోజును ఊహిస్తూ…ఆశిస్తూ…
ధారాపాత్రలమనసుకళ్ళ చెలమలలో చిప్పిల్లే వడివడిసుడితిరిగే సునామీ ఆనవాళ్ళను చూపే,
కన్నీటి ఝడులనాపే మనఃస్థైర్యం
ఆ పైవాడు కనికరించి కటాక్షించాలి!
రాలిపోయిన పూలన్నీ సద్గతులబాటపట్టి
లోకేశ్వరుని పాదాలచేరే నివాళిని మనమహత్తరఓదార్పుగా
వారికి అంకితమవ్వాలి!
సాటివారిగా మన గుండెచెమ్మలో…
వారికో దీపం పెడదాం!
విమానపు విధివ్రాతలో విగతజీవులైన సాటి…
సోదర,సోదరీమణులకు… విశేషించి…. ముక్కుపచ్చలారిపోయిన పసిమొగ్గల ఆత్మ శాంతికి
అశ్రుఒక్కటి ధారపోద్దాం… సద్గతులనందాలని అనుక్షణం తపిద్దాం!”
*************
“కూచి”
చిత్రకారుడు
కూచి 'కోనసీమ కథలు '
1:"రావులపాలెం ఆరటిగెల"
.
పసుపుపాదాలతో మెరుస్తూ… రావులపాలెం రోడ్డుకేసి బయల్దేరిందా…..గోదారోళ్ల పరిస్థితి
ఇహ అంతే!
పచ్చబొట్టులాంటి చిన్ననాటి తీపి కావిడి జ్ఞాపకాలు..ముక్కావల లాకుల్లోంచి ఎగసిపడే చేప్పిల్లల్లా ఎగిరెగిరి పడతాయి ఎంకాయమ్మ తీరు చూస్తే!
పొద్దుగాల..శ్రీరాంపురం రావులోరి గుడికి దుత్తతో పాలిచ్చి..దణ్ణం పెట్టుకుని డూటీ ఎక్కే సత్తెప్ప… అయినవిల్లి ఇగ్నేశ్వరుడి గుళ్లో ఏరికోరి పెళ్లి చేసుకున్న లంక పుచ్చకాయ కదూ…ఎంకాయమ్మ!
పదార్రోజుల పండగ దాటకుండానే….
“నీళ్ళకావిడీలు మోత్తే ఏటవుతాదీ నా అరటిపువ్వు!భుజాలు మగ్గిపోవడం తప్ప…అదే సక్కగా ఇప్లాను ఏసి..బుగత మాటసాయం అట్టుకెల్లి.. కూసింత ఏటిగట్టు అరటితోటల్లో బేరం కుదుర్చుకునేసి..ఆనక సైకీలు పట్టినన్ని సక్కెరకేళీయో… బొంతరిటో మోసుకుపోయి రావులపాలెం అరటి సంతలో అమ్ముకొస్తే నీ సేవ తెలుత్తాధి ఊరోళ్లకి..నాలుగు పిక్కలు ఈ కట్టుకున్నదాని జేబీ లోకి…అర్ధమయ్యిందా.. ఆ……!!”…ఇంకా కాపరమే పూర్తిగా పెట్టని కొత్తపెళ్లికూతురు ఏంకాయ.. తీపి సాదన ఇది!
పోనీ ఆగిందా అక్కడ…ఊహూ..
“ఎంచక్కా కోటిపల్లి కొర్రమీను లాంటి ఈ చక్కని చుక్కకి..మర్రోణ్ణి కోకముక్కలూ..రైకలూ…పిన్నీసులూ…ఆంబోజిపేట మంచం మిఠాయి…అమలాపరం కమలేశ్వరా టాకీసుకాడి పాక వోటల్లో గొల్పకోడీ..కలరుకాయా…
ఏంటీవోడిసినీమా బెంచి టికెట్టూ…అబ్బో అన్నీ కొనిపెట్టావా ఏటీ …..ఆలోచించు నా ఖండ్రికరేవు ఏడిఏడి పాలకోవా ముద్దమావా…!”
అని..జగ్గన్నతోట తీర్ధంలో మాబాగా బెల్లంపాకంపట్టి..ముద్దై.. ఆనక కొబ్బరిచెట్టుకుకొట్టిన సీనామేకును పట్టి.. మాబాగా సాగి గట్టిపడుతూ…రంగు తేలుతున్న బెల్లంజీడికడ్డీ లా మెలికలుతిరుగుతూ ఎంకాయమ్మ అంటున్న మాటలే సత్తెప్ప చెవిలో…జోరీగ చందాన ఖయ్యిమని!
“అవునొరే….మాచెడ్డ సక్కని…కోటిపల్లి గొబ్బరినొజులాంటి ఇలవైనమాటరా నీ పెళ్ళాం ఎంకది..!!ఇనే ఓపాలి..!! మరి….బేగీ…అలా చేసీ..!”
ఇది..వానపల్లి అద్ధంకారిలంక పొగాకు చుట్ట పొగలోంచి ఘాటుగా కలిసి వచ్చిన గుడిసె పెద్ద ఈరితాత ఊతమైన మాట!
ఇది..సుగ్రీవాజ్నే సత్తెప్ప కాడచెవికి!
“మరేగందా….నీలి ఉమ్మెత్తలా నిగనిగలాడే ఎంకాయమ్మ కోరిక…వానపల్లి పళ్ళాలమ్మ మొక్కే…తీర్చద్దా ఏటీ!!
సత్తెప్పలో ఇలా గింగిరాలు తిరిగిన ఎంకాయ చెప్పిన మాచెడ్డ ఇసయం….సత్తెపెమాణికంగా నిజవై కూర్చుంది….రావులపాలెం సత్తిరెడ్డి సైకిల్ కొట్లో కొన్న రాలీసైకిల్ సాక్షిగా!
నిమ్మకాయలూ…రాజమండ్రీ కోటగుమ్మం ఎండు మిరపకాయలూ కలిపి సైకిల్చక్రం ఊచలో గుచ్చి… సైకిల్బారుకి దిష్టి తాడు బింగించి…పట్టినన్ని బారుఅరటిగెలలతో కట్టున్న సత్తెప్ప పుష్పకంసైకిలు… ఎంకాయమ్మ కాటుకకంటికి వ్యాగ్రేశ్వరం ప్రభే..కన్నుల పండువ చేస్తూ!
ఈ ప్రణాళిక బుర్రలో వచ్చిన ఉత్తరక్షణం…ఎంకా…
పసుపుపాదాల బొటనవేలుతో నేలను రాస్తూ…గుండెలమీద కాశికాయలగుళ్లపేరును మునిపంటితో చిలకలా కొరికేస్తూ అన్నమాట ఐతే…సత్తెప్ప మదిలో ఆగరుధూపంలా చెదరకుండా నిటారుగా నిలబడేసింది ఆట్టే!
“ఐతే మావో….నువ్ నీ రాల్వే ఇసైకిల్ని ఎన్ని గెలలతో ఐనా నింపీసుకో..కానీ…సైకిలు ఎనకమాల సీటు మాత్రం నాది…నాదే..ఆ!
నేనూ నీతోటే పెందలకడే..సద్ధితో సంతకొచ్చీసి…నా ఏడేడి కొబ్బరినౌజులయాపారం నే చేసుకుంటా… తెలుసా ఒవిరిలాభాలు ఆళ్ళవీ మరే…కొసరేం ఉండదు సత్తెపెమాణికంగా..నమ్మాలి!”
అంటూ…సత్తెప్పకి ఓ జీడిముద్దుపెట్టి… ముత్యంలాంటి మరో మాట కూడా అంది…వక్కలంకతోట చెరుకు ముక్కకూడానవలతా…
“ఏవీలేదయ్యా..సన్నీళ్ళకి ఎన్నీళ్ళు సాయంగ0దా…ఆరూపాయకి ఆరూపాయి జెట్టు…మనిద్దరి పాపాయిలా….మాట ఇనవూ!”
ఎంకాయ లోతైన మాటకి
ఆట్టే చూస్తూ ఉండిపోయాడు సత్తెప్ప ఆమె ముందుచూపుమాట మంత్రోపదేశంలా వింటూ!
అంతే…ఆ మాట కార్యరూపం దాల్చి..ఇదిగో..ఇప్పుడిలా… అరటిగెలల సైకిలు రోడ్రు ఎక్కింది!
ముందు సత్తెప్పా…ఎనక ఎంకాయమ్మతో బ్రహ్మోత్సవసైకిల్ పుష్పకమే అది మరి. ఏనుగుమహల్..రావులపాలెం రోడ్డు మీద!
దీనికి సాక్ష్యం వీరి జతచూసి మురిసే…కొబ్బరి తోటలూ… అరటితోటలూ…రోడ్డువార కాలువ..అందులో బల్లకట్టూ…మళ్లీ ఆ కాలువలోని చిట్టిచేపల గుంపుల కేరింతానూ!
ఏవో రెండు పడుచు తూనీగలు
జెట్టాపట్టాలేసుకుని కోనసీమ తోటల్లోపడి కోలాటం ఆడుకుంటూ…తిరుగుతున్నట్టు!
నువ్వుజీళ్ళూ…తంపడతేగలూ…లంక కూజాజామకాయలూ… జీలకర్రకారం వాటంగా కలిపినతోటనారింజరసం…
పాలైసూ…కలరుసోడాకాయ అబ్బో…ఎన్నని రాయాలి….వీళ్లిద్దరి మాయాబజార్ తిండి చూసి!
వడపప్పూ..పానకం సరిపోక..దొరికిన అన్ని తిళ్ళూ ఆబగా తినేస్తూ…పంచవటిలో పండగ చేసుకుంటున్న సీతారాములు కదూ ఎంకాయమ్మా…సత్తెప్పలు!
ఎంచక్కని మలయమారుతంలా వారి జీవితం…వారి గోదారొడ్డు పాకలోని కనకదుర్గమ్మ తల్లి ముందు కట్టిన ముడుపుడబ్బానే అచ్చంగా!
ఐతే..ఇక్కడో తమాషా…!
ఏళ్లనుంచి అన్ని అరటిగెలలని అమ్ముకొస్తున్నా……
ఆరముగ్గిన …..ఆరారో
అరనవ్వును అరణంచేసి తన చిటికినవేలు పట్టి.. ఏడడుగులూ తనతో నడిచి,తన జీవితానికో వైభవం తెచ్చిన ఈ “ఆస్థాన అరటిగెల”నుమాత్రం..ఊపిరి ఉన్నంత వరకూ…హరిశ్చంద్రుళ్ళా అమ్మేయను అనే …మాచెడ్డ పెళ్లిబాస సత్తెప్పది ఊరి పళ్ళా లమ్మ పాదాల సాక్షిగా!
“మరే..నే వదులుతానాఏటీ!ఊఊ.. మాఆయన ఎనకమాల సీటున కూకునే ఆరముగ్గిన పచ్చని పసిమిరంగు నిలువెత్తు చీరకట్టిన చక్కెరకేళీ ఆరటిగెలను నేను కాదేటీ…ఆడి కూడా తోడూ నీడై ఉంటూ..ఆడి పసిమనసు తీపి చేస్తా…..ఆ..!” అనే ఎంకాయమ్మ తియ్యని మనసు తీరు… సైకిలెనకాల కూర్చుని సత్తెప్ప నడుం వాటంగా పట్టి ఊరేగే వైనం సత్తిగాడికో దివ్యవరం!
****************
“కూచి”
చిత్రకారుడు
2 :"ఎంతకంతే ఎంకటలక్ష్మి”:
ఎర్రమిల్లారివీధి ఆమూలనుంచి మాచిరాజారివీధి ఈమూలదాకా
పత్తిమందారవంటి తెల్లరూపుతో… “మందారం” చంద్రాయణంకి వచ్చిందంటే..మగాడికి ఒంటిమీద గుడ్డాగదు…నోట్లో తడిజాడ కలికానికైనా కనపడదు.
ఒంట్లో వేడి నిలువెత్తు ఈలదుంగల మంటే.
మగాడనేవాడికి ‘మందారం’ వయస్కాంత…ఆయ:స్కాన్తం…
ఓ గులాబీజాములగుత్తి.
బాహా ఒళ్లుగట్టిపడ్డమిరియపుజున్ను.
తాపేశ్వరం తాజాకేజీకాజా.
సైజుతో.. సరిపోలికని గోడవతలకి విసిరేస్తే…”పూరియా”శేట్ అమ్మే మిర్చిబజ్జీ మరియు అల్లంపకోడీ!
…సురసుర సురారికత్తె.
ఇహ మందారం ఊరోళ్ల ఉమ్మడిసొత్తులా!ఊరికంతా మరదలులా ఝణాయింపు!!
సిగగొయ్యా!అసలు దాని ఝణాయింపే చెయ్యేరుపెద్దకాపు అచ్చోసిన ఆంబోతు వైనం…ఈ పోలిక అతకదని తెలిసినా.
మందారం రాకతెలిపే సౌంజ్ఞలు మచ్చుకు కొన్ని ఊరివారికి సంకేతాలై.
పెద్దమసీదు చిన్నిగెడ్డం మీరాసాహెబ్ వద్ద సగండబ్బు…సగంవగలు జమచేసికొన్న ‘మరికొళందు’ అత్తరు వాసన…ఆగుభాళింపు మందారంరాకతెలిపే ప్రోటోకాల్.
ఇహ కట్టూ బొట్టూ….ఇదో గిలిగింత పడిచచ్చిచూసే కళ్ళకు.
చమ్కీల్ చమ్కీల్ తెల్లచీరమీద చారడేసిపెద్దగులాబీగుత్తుల ప్రింటు…మధ్యనకొట్టొచ్చినట్టుకనపడే ఆకుదొంతుల ఆనవాళ్ళతో.
ఇక ఆ చీరెకట్టు…అబ్బో చీరకే సిగ్గేసేంత బిగి….జిగిజిగేల్.
అసలు పిటపిటలాడే వ్యక్తికి సజీవ సాక్ష్యం మందారం.
వక్ఖరవ్వ తక్కువ
దుబ్బుగడ్డితో ఓ జడ…కిందుగా అర్ధచంద్రుళ్ళా మల్లెపూల దండా… ఓ బెత్తెడు వెనుకపట్టుతోజాకెట్.. నడుముక్రిందుగా హంపీ అక్కాచెల్లెలురాయిలా పిరుదుబిరుదులూ….రమ్భాస్తంభలూ…బిగుతుపిక్కలూ…గజ్జెలపట్టీలూ.. తనవెనుక సరంజామా!
ఎందుకు ముందుగా.. వెనుకనే వర్ణించానంటే… గూడావాడి పెద్దగోడమీద కూర్చుని ఉప్పుకారం అద్దుకుంటూ దొంగచాటుగా మామిడి పిందెల మజాచేసుకునే కిష్కింధవాసులుగా మేం మాచిరాజారి వీధిలో చిరపరిచితులం. అందుకే..
ఆవంక మాచిరాజు రామదాసుగారు… ఇటు గూడాచంద్రoగారి అరుగుమీదజమైన ఐనాపురం సారధిగారు… మావైనం సాంతం పసిగట్టి హుంకరిస్తారేమోననే చిన్నపాటి వినయభయం వెన్నులో.
అందుకే మధ్యేమార్గంగా వెన్నుదర్శనప్రక్రియని చెప్పటం ఓ ఒడుపుగా అందిపుచ్చుకున్నాం.
ఐతే వక్ఖకోరిక మాకిష్కింధ సమూహంలో బలంగా ఉంది.
‘ఒరే సాయీ!వెనుకే ఇంత భీభత్సరసాయనపు రంగరింపు బుర్రని కలియదిప్పుతోందే ఇహ సాహసించి…తన మొహం వైపు చూడనట్టుగా ఓసారి చూసేస్తే…మన బుర్రలు ఏమౌతాయి…
“బహుశా కమలేశ్వరాటాకీస్ వెనుక ఖాళీస్థలంలో చేసే సర్కస్లో గ్లోబులోతిరిగే బుల్లెట్ మాదిరి గింగిరాలు తిరగవూ!!!
‘ఇనాసరే…కొంత సాహసించి …మరికొంత పెద్దరికాన్ని లేతమీసాలపైపూసి…చెన్నమల్లేశ్వరుడికి ఓ దండం పడేసి కార్యరంగంలోకి గబుక్కున దూకేసి మందారం మొత్తాన్ని కళ్లారాచూసే పనికానిచ్చి…తరిద్దాం….”
అనుకున్నాం అసెంబ్లీతీర్మానం లెఖ్ఖ.
అసలు మందారాన్ని క్రీగంట చూడ్డానికి కూడా గుబురుమీసాలవాళ్లే కొంత ఆలోచించిచూసే పరిస్థితి అమలాపురానికి ఉందని గడియారస్తంభం సాక్షిగా కోనసీమకి ఎరుకే.
అందుకే నిక్కరువాలాలమైన మాకు ఇంత ఆలోచన… మందారం ముందువైపు సోహసు-సోయగం వైనాన్ని మా కళ్ళతో పప్పుధప్పళంలా సాంతం జుర్రేయాలని.
అందుకే హైస్కూల్ రోడ్డుఆబోతులా మాలో ఏదో తెగింపు…మందారం వంటిఅత్తరులా మామనసుని చుట్టేసి.
“ఆరోజెప్పుడో?”అని పుల్లయ్య కాఫీహోటల్లో,గరిగుంట చెరువు మలుపులో,మూగాడి కొట్లో మసాలావడలు తినేడప్పుడో… ఆఖరికి..మాచిరాజారి దొరువులో ప్రొద్దుటేళ చెంబులతో గూడిన సామూహిక చర్చల్లో…ఇదే పతాక శీర్షిక అప్పట్లో!
ఐతే…ఎప్పటికైనా ఈ సమస్యని కోటిపల్లిరేవును డింగితో దాటినట్టు దాటేయాలని మాకిష్కింధలతీర్మానం.
“ఎందుకూ.. వక్ఖకొరికినంతసేపట్లో మందారం ఎదురునిలిచి ఆమె వైనాన్ని కళ్ళతో జుర్రేయచ్చుకదరా కుంకపరంధావయ్యలూ!” అని మీరు అనేయచ్చు చల్లపల్లికరణం గారిలా హుందాగా…!!
కానీ అనేకూడదు! ఎందుకంటే…మందారం..”ఫ్రoట్గ్రౌండ్” మాట అటుంచి “బాక్గ్రౌండ్” వింటే వెన్నులో చలి హిమాలయాల అమ్మ పెనిమిటి అవుతుంది.
సదరు విషయం కొంత విపులీకరిస్తా అవధరించండి….
ముమ్మిడివరం గేటుదాటేసేసి… అటుగా వెంకన్నగుడికిపోయే దారిలో
సరస్వతీబాయిగారి ఆసుపత్రి దాటి కూసింత ముందుకెళ్లి కుడిచేతివైపు తిరిగి మళ్లీ కూసింత వెళ్తే అదే శ్రీరాంపురం.
కలలకుర్రోళ్ల రసరాజధాని.
అక్కడే ఉంటూ… ప్రౌఢఢక్ఖలా జయభేరివేసుకుని ఊరినో ఊపు ఊపే సదరు మందారం… ఊహతెలిసి…ఓణీ బిగించినకాడనుంచీ…. కన్నెరికందాకా..’నల్లసత్యంఇలాకా’నే అనేది బహిరంగరహస్యం.
ఇహ “నల్లసత్యం” అంటే…తుమ్మమొద్దు స్వరూపం,వ్యాఘ్హ్రశ్వరం ప్రభంత ఎత్తూ..మర్రిమానంత లావూతో ఊరికో పెద్దదిక్కు.
మోకాళ్ల దిగువాయిగా గీరుఅంచు పంచె…ముతకలాల్చీ,అందుండి పొడుచుకొచ్చే పొట్ట,చేతిపదివేళ్లకూ శ్రీవారే హాశ్చర్యపోయేన్ని ఉంగరాలూ…మెడలో మోయలేనంత బంగారగొలుసులు…వీటినన్నిటిని మించి కొరకంచుల కళ్ళు, కోరమీసాలూ… అబ్బో సత్యం వంటిపైనున్న సరంజామా భీభత్సమే చూపరులకు.
పొట్టపైవరకు మాత్రమే గుండీలు పెట్టుకుని..”రా..దమ్ముంటే చూసుకుందాం..” అనేలా గుండెల్ని చూపిస్తూ…పైకి సైకిల్షాప్ బిల్డప్ ఐనా…లోపల సెట్చీటీ రౌడీసెటప్.
చక్రవడ్డీల రారాజు…ఎదురులేని నోటి దూ….!బూతుల హెడ్డాఫీస్…ఇక ఎడమచేతి పదునుకు ఎన్ని దవడపళ్ళ సాక్ష్యమో జనాలకు తెలుసు.
ఇవీ శ్రీ నల్లసత్యం భుజకీర్తులు గుండెలవిసేలా.
ఖర్మకాకపోతే వీడే ఓ పెద్దమనిషి ఊర్లో గుళ్ళకి.
చేతిచమురు వదలకుండా గుడి సంబరాలు పురమాయించి చేయించడంలో చేతికి నాలుగు బంగారుమురుగులు వేయించుకున్న దిట్ట.
ఎంత సిసలైన క్రూరుడో అంత దైవభక్తికి ప్రతీక.
అందుకు సాక్ష్యం..నుదుటన అలమి ఉండే గంగసిందూరపునామం. కుడిచేతికి కట్టిన రక్షలూ.
ఆ బొట్టు వాడికి పచ్చబొట్టే నాకు తెలిసి.
అసలు ఆరూపం…
పత్తికాయల్లా విడిన ఎర్రకళ్ళు… ఎడమచేతి విసురూ…ఇవి చాలవూ గుండెలు అవిసి మూలగడానికి.
కానీ…
ఈరూపం ఒకరికి మాత్రం.. కారం జల్లుకుతినే వెన్నముద్ధoత రుచి….! అవును…తనకే మందారానికే!
ఓనాడు..దేవినవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా…ప్రత్యేక ఆకర్షణగా, జనరంజకంగా,నీతిబోధగా ఏర్పాటుచేసిన’చింతామణినాటకాని’కి మందారం ఓపెద్ద ప్రాయోజకురాలు.
తోటి ‘పూలసఖుల’తో వచ్చి ముందువరుసలో.కొబ్బరాకు తడికెలమీద కూర్చుని వగలుపోతూ.. జార్చేసుకున్న పమిటను సర్దేసుకుంటూ..మందారం హంగామా మామూలుగా ఉండదు…!
ఎంతంటే స్టేజిమీది నటులకూ ఈ వైనం శృంగారసునామీ…చెప్పే నాలుగు డైలాగులు మరచిపోయేలా!
పెదవి కొరుకుళ్ళో…క్రీగంటిసైగలొ… పమిట తాడింపులో,అకారణ సకిలింపులో,అత్తరు గుభాళింపులో…స్టేజ్ లైటింగ్ మీదపడి మెరిసే చీర మెరుపులో….
పైవారినే కాక,ఊరిజనాన్నిమించి…. నల్లసత్యాన్ని అపరిమితంగా ఆకర్షించి,ఖండ్రిక కోవాముద్దలా ఊరించాయి.
మందారానికి మాత్రం సత్యం కేజీల బంగారుసరంజామా మనసుని ఊరించింది.
ఇంకేం! సత్యంఖాతా మందారంఇంటి మూలగదిలో తెరుచుకుంది.
ఓం ప్రథమంగా…రంగపూజ తాంబూలంతో మందారబృందానికో మాంచి ఛాన్సు ఇచ్చాడు సత్యం..తన కూతురి పెళ్లివంకన.
లక్షలు కట్నంఇచ్చే బావగారి
సరసరసికత తెలిసిఉన్న వియ్యాలారు చొంగలు పొంగించుకుంటూ.. ‘సరే..’ అనగానే ఆరాత్రి మందారoప్రతిభ రేకలు రేకలుగా విచ్చుకు మరీ రసికుల్ని విప్పసారా మత్తులో ముంచి… నానబెట్టింది…!
ఈ విషయం కోనసీమకోడై కూసింది.
ఇదిగో ఈ రంగం మందారాన్ని…బాగా ఆకర్షించింది.అంతే..
‘మందార’పువ్వు..నల్లసత్యం చెవిని అలంకరించింది.
ఇంకేముంది…రాజు తలుచుకుంటే…!!
ఇహ ఆప్రాంతం మందారానికి అడుగుమడుగులొత్తింది.
గుమ్మంలో పాలగేదెలు,అరుగుమీద తామరాకు వేడిటిపినీలు,మధ్యాహ్నం కోడికుర్మాలు…రేత్రికి దోరసీకులు.
ఇహ పండగలకి విందుపొందు పసందులతేనెపనసతొనలు.
ఇన్నిదొరికే వేళ మందారానికి లోటుఏమి?
సత్యానికి ఇంతకన్నా స్వర్గం ఏమి?
ఐతే….
కుర్రకారుకు మాత్రం లోటున్నరలోటు!సత్యం భయాన మందారం సింగారం నేత్రపర్వంగా ముందునుంచి జుర్రేయలేకపోయావని.
చిత్రంగా ఊరిముదుర్లకు మందార వైభవం పాతచింతకాయతొక్కు కావచ్చు.కానీ!టెంకముదిరి పీచుగడ్డాల..నునులేత మీసాల కుర్రకారుకు ఆమె ఓ కోటిపల్లి కొత్తకొబ్బరి.
తననోపాలి ముందునుంచి చూసితరించాలనే ఉత్సాహం వారిలో!
అనుకున్నట్టే…ఆశపడ్డట్టే
సంకల్పం వారి మదిగదితలుపును ఠపీమని కొట్టింది ఓనాడు!
కారణం..
సత్యం ఎదో కేసు విషయమై కాకినాడ కోర్టుకు వెళ్లడం.
ఇదో మహావరం కుర్రోళ్ళకి!!
ఎందుకంటే షాపులో నల్లగుండ్రాయిలా కూర్చున్నా…చుట్టూఉన్న అలగా,సోంబేరి నాయాళ్ళు ఏజంట్లు కాగా…ఊర్లో ఏ చీమ చిటుక్కన్నా..ఏప్రాణం పుటుక్కన్నా విషయం సత్యం చిగురుచెవులకు చేరాల్సిందే…!
ఐతే…బృందంమొత్తం కేసులో ఇరుక్కుని కోర్టుకి హాజరు కావాల్సి ఉందన్న కారణాన…సత్యం కాన్వాయ్ అట్టహాసంగా కాకినాడ కదిలింది.
అంతే!
ఇహ కుర్రోళ్ల చూపుకూ…చొంగకూ అడ్డం లేకుండాపోయింది.
‘ఇప్పుడు మందారాన్ని ఎగాదిగా చూచుట ఎలా?’ అని ఐన్స్టీన్ అమ్మమొగుళ్లలా ప్లానుల మీద ప్లానులు…వేస్తున్నారు కుర్రాళ్ళు!
చిత్రం..వీళ్ళు ఒకటి తలిస్తే… మందారం ఫ్రెండ్ ‘బండలక్ష్మి’ మరోటి తలచి…తన ‘రొండోమొగుడి మూడోకూతురి ఒకటోపిల్లాడి’ పుట్టినరోజు వేడుకకు ధూమ్ధామ్ ఆహ్వానం మందారకు చేరవేసింది.
ఇంకేముంది…మందారం మంది మార్బలంతో…ఈ కుర్రాళ్ళ పక్కవీధికే రానే వచ్చింది.
కథ ముందు చేసిన మందారంవర్ణనలక్రమం అలికిడి…అలజడి రేకిస్తూండగా కుర్రాళ్ళ కళ్ళు శాటిలైట్ కెమెరాలై వీధిమలుపును స్కాన్ చేస్తున్నాయి.
శుభఘడియలు వచ్చి మందారం అడుగు వీరికంట పడింది.
అంతే అంబరాలంటే సంబరంగా… బండలక్ష్మి తననెచ్చెలికి ఏర్పాటుచేసిన ‘ధూం’తో వీళ్ళూ ‘ధామ్’ అయ్యారు!
ఒకటే..కడియపులంక పుష్పవృష్టి… వేటపాలెం తారాజువ్వల తరంగం… రోడ్డంతా ‘పెటేపుకాయల’వీరమోత… ఇహ.. తాసామర్ఫాలూ,రాండోళ్ళూ,కోలటం
అదో జాతరఆహ్వానం..మందారానికి!
పట్టపగ్గాలులేని కుర్రబృందం… మందారం స్వాగత సత్కారాలకు పెద్దపీట వేశారు…అన్నీ తామై సంబరం చేశారు. మoదారపు హుందాతనపు వైభవంచూసి!
ఆనక ఆమెతీరు దగ్గరసా చూసి.. వెర్రెత్తిపోయి ఒకరినొకరు అభినందించుకున్నారు.
ఆపై ఆహ్వాన సంరంభం చాలించి,
“మందారంరూపం”చూసి తృప్తిపడి… సంతృప్తిపడి సేదతీరారు కాలువవార గున్నమావితోపుకువెళ్లి.
*******************************
“ఐతే!పెద్దరెడ్డయ్య చెప్పిన తీరేనా.. మందారానిది…నిజంగా అలానే ఉంటుందా…?”
“ఒరినీయబ్బా!ఇన్నిరోజులుగా వాకబులో తేలిన నూరుపైసల నిజం అదేరా మావా….!”
“అలా ఎలారా?నమ్మశక్యం కావట్లే…ఓసారి ఇదేవిషయం మాఇంట్లో భోజనాలదగ్గర ‘నర్తనశాల’ సినిమాచూస్తూ తెగ మాటాడేసుకున్నాం…
మాతాతగారైతే ముసిముసినవ్వులే మామ్మచెప్పే మందారం వర్ణన వింటూ….!”
“ఒరే… కథ పెద్దడవడం తప్ప ఉపయోగం లేదు…ఇహ మాటలాపి చేతల్లో దిగి…మందారాన్ని సాంతం స్టడీచేసి…ఓ నిర్ణయానికొచ్చి… నిజమైతే సంబరం చేసుకుందాం….!”
ఇదీ కుర్రాళ్ళ తీరుమానం.
వారి తపన ఫలించిన వేళ ఇదిగో.. ఈవేళ!!
ఆవైనం…ఇదో…ఇదే…
*******************
మందారం…
“ముందునుంచి…స్ఫురద్రూపం…
మాంచి ఒడ్డూ..పొడుగు…. నిమ్మపసిమి..తీరు తీరు కురులూ… విశాలమైన నుదురూ…చక్కని కళ్ళూ…కొటేరు ముక్కూ… జున్నుముక్క బుగ్గలు.. బెల్లoముక్కగడ్డం పొడుచుకు వచ్చి..సమాంతరభుజాలు…విశాల వక్షం..అజానుబాహువులు.. చిరుబొజ్జ..!
తీక్షణంగా చూపు…రూపు!!
ఎదో తెలియని సమ్మోహనమంత్రం ఉపదేశంపొంది ఇంత జనాకర్షణతో ఊరు హృదయాలని కొల్లగొట్టడం….ఇదో వైభవం…!!
అందుకే…కుర్రగ్యాంగ్లో ఈ క్యూరియాసిటీ….అది మందారంలో ప్రస్ఫుటం అవ్వడంతో… ఎగిరి..ఎగిరెగిరి గంతు!
మళ్ళీతోటలో చేరిన ఈ కిష్కింధులు ఆనందంకి అక్కడ చెల్లాచెదరైన బీరుసీసాలే సాక్షి!
“ఐతే. ఒరేయ్….మీ నానమ్మ చెప్పినట్టు మందారం “పెద్దఎన్ఠీఆర్” పొలికల్లోనే ఉందిరా…ఏమో అనుకున్నా….చూడగానే పిచ్చెత్తిపోయా….!”
“కదా..నేనూనూ…రూపమే కాదు…నడక…మాట….సూపర్రో బాబోయ్….!”
“ఒరే గుర్తుందా…విఠలాచార్య ఓ సినిమాలో వేయించిన కోలాటంపాటలోని ఆ ఏంటీవోడి ఆడవేషం కన్నులముందుకి ఇలా కదలి వచ్చేసిందేంట్రా..హమ్మో….!”
“ఏమైతేనేం…. ఇంట్లోవాళ్ళని బ్రతిమాలి…మద్రాసెళ్లి ఎంటీవోడి ఇల్లువెదుక్కుని ఒక్కనిముషం చూసేకంటే… మనూళ్ళోనే ఉంటూ…ఈ”ఎంటీమందారాన్ని’ రోజూచూసుకు తృప్తిపడదాం…!”
“అవునురా…ఇందాకట్లా బ్రహ్మరథం పడదాం….పడుతూనే ఉందాం!!ఆయన ఎలానూ మనకి దొరికడు…!”
“మరే… ఎంతకంతే ఎంకటలక్ష్మి”!
“సరేనా…!!!”
“సరేరా సామీ…నమస్కారం..!”
“ఇహ…ఈ ఎంటీమందారానికి మరోసారి జేజేలు చెప్తూ….ఈ చివరి బాటిలూ… చివరి సిప్పూ షేర్……!”
“అవునోరే!మరి సత్యంగాడూ…..??”
“తెల్దెటీ…ఆడు “ఎంటీవొడికి వీరఫాన్”…. అందుకే మందారాన్ని మంచంకోడుకు కట్టేసి..తనదగ్గరే అట్టి పెట్టేసుకుని తెగ సుఖభోగించేస్తన్నాడు…హిహి…..!!”
*******
కాలువవార మామిడితోపు నవ్వులపువ్వులు పూస్తోంది!
దూరంగా ఈ తంతుచూస్తూ,అక్కడి మాటలువింటున్న కోకిలమ్మ….
“ఐతే!ఎంటీవోడి బొమ్మనోపాలి చూడాలని నిశ్చయానికి వచ్చి… ఊళ్ళోకి రివ్వుమంది…!
‘ఆకుచాటు పిందె తడిసే….కొమ్మచాటు పువ్వు…కుకుకూ..’
అని..పాడుకుంటూ!
***************
‘కూచి’
చిత్రకారుడు
3" ఎంతరుచిరా..”:
.
“నాకు ప్రేమించడం రాదు…రాదన్నానా…”!మందారమొగ్గలా మొహం ముడుచుకుని..జడగంటల్ని చూపుడువేలితో తిప్పుతూ….అరటాకులు శుభ్రంచేస్తూ సిగ్గుల్లుతోంది “సుబ్భులు”.
“మరి అయితే…సుబ్భుని ప్రేమలోకి చెరువులోతు దింపుతాఅని ఆంజనేయస్వామి గుళ్లో… పెద్దగంటకొట్టి శపథం చేశానే…ఎలానే ఇప్పుడూ…ఉంకోసారి ఆలోచించి చెప్పు…ఈలోపు ఓ పోలిపూర్ణం బూర్లవాయ తీసొస్తా.. ఆ” అంటూ..చంకగోక్కుంటూ వంటపనిలో పడ్డాడు “ఆచమానం”.
మానేపల్లి చంద్రావధాని గారి రొండోభార్య చివరాఖరి కూతురి పెళ్లికి కొల్లూరారి సత్రవులో వంటలు చేస్తూ!
కథలోకొస్తే…
పత్తిభొట్ల దీక్షితులు….బలుసు శ్రీసుబ్బలక్ష్మి..భలే…లేబ్రాయపు ప్రేమికులు!
“ఇగోనర్రా..కొత్తపిల్ల సుబ్బి బతికి చెందిన కుటుంబపు పిల్ల…!
ఇహ ఎదో పని పురమాయించి.. తర్ఫీదు ఇస్తూ కడుపులో పెట్టుకు..నాలాగే మీరూ చూడాలి దీన్ని..సరేనా…!”
హుకుం జారీచేశాడు పసుపుతో మూటకట్టి ఉన్న నల్లమందు ముద్ద లోంచి ఓ చిన్నం ఉండతీసి..గుండ్రంచేసి మింగుతూ వంటల పెద్ద “బూరెలగణేశం”!
కోనసీమలో..ముఖ్యంగా పేరూరు..లక్ష్మీనరసింహస్వామి గుడి పక్కవీధి బూరెల గణేశ0 పెళ్ళివంటలో గరిటతిరిగిన వంటవాడు.
కేవలం మునక్కాడలు మాత్రమే తరిగేంత ఓపికఉన్న ఓ బక్కపలచ పాత ప్రియురాలూ,రుబ్భురోలుకంటే కుదిమట్టంగా ఉండే ఓ శిష్య పరమాణువూ…అగ్గురారం అంచున జీవితం లాగిస్తున్న ఓ తలచెడిన రాధక్క…మిగతా బూoదీచిల్లర సహాయకులతో గణేశo “అరసవెల్లి సూర్నారాయణా క్యాటరర్స్ ఓనర్!
ముఖ్యంగా విధవిధాల బూరెలు చెయ్యడంలో గణేశం పద్మశ్రీకి ఎక్కువా…పద్మవిభూషణ్కి తక్కువా అంటూ కోనసీమ…ఈయనగారికి మడిపట్టం కట్టింది.
అందుకే..”పేరూరు
గవరగుండుపొగుల సుందర కామేశమహర్షి” కాస్తా…ఇప్పుడిలా బూరెల గణేశం గా ప్రసిద్ధుడు.
ఈయనవద్దే…ఎంచక్కహా దబరా గిన్నె…పులుసుగరిటల్లా కలసిన ముచ్చటైన పెళ్లికాని జంట ఆచమానం,సుబ్భులూనూ!
రుచులు చూసి ఏవంటలో ఏదితక్కువయ్యిందో సరిచూసి చెప్పి సరిచేయించే అదనపు పనిలో ఆచమానం అద్వితీయుడు!
ముఖ్యంగా ముక్ఖలపులుసో…దప్పడం అయితే…అలా గాడిపొయ్యమీది గంగాళంలో కుతకుతా ఉడుకుతున్నప్పుడే కాడగరిటతో కాస్త అలవోకగా తీసి…కుడిచేతి పురిషిట్లో పోసుకు రుచిచూస్తూంటే…బూరెల గణేశo కంటికి…
మంత్రం తిరిగిన బ్రాహ్మడు ఎంచక్కహా ఆచమానం చేసినట్టే అగుపడేది.
ఇదిగో ఇక్కడనుండే..పత్తిభొట్ల దీక్షితుల పేరు బొక్క బోర్లాపడి…”ఆచమానం”గా రూపాంతరం చెందింది.
సుబ్భులు తమ వంటల కుటుంబంలోకి రాగానే గారె విరిగి చెరుకుపానకంలో పడ్డట్టూ,ఎంత గాలి తగిలినా మెత్తపడని అప్పడంతంతూ,దబ్బకాయ పులిహోరలో మాబాగా కలసి,ఊరి… నోటికి కమ్మపులుపుదనం తెచ్చే జీడిపప్పు తీరూలాంటి శకలు ఆచమానం చేత సుబ్బి ప్రేమకు ఆచమానం చేయిస్తున్నాయ్.
అసలు ఫస్ట్ ఫస్టు…దొడ్డారం వెంపరాల మాస్టారి మనవరాలి పెళ్లి వంటలదగ్గర కదూ లేలేతకొబ్బరిపచ్చడి రుబ్భుతూ…మొహానపడ్డ ముంగురుల్ని మోచేతులసాయంతో సద్దుకుంటున్న సుబ్భి అందంచూసి…పదునుతేరిన హల్వాలా ఆచమానంమనసు ఫ్లాట్ అయ్యింది.
ఇగో…అప్పణ్ణుంచి ఆచమానం మనసు మనసులో లేదు.
అంతా సుబ్భిమీదే ధ్యాస.
వరిపిండి జల్లిస్తూ అందులో సుబ్బి పేరు రాయడం,లంక సూరీడు గుమ్మడికాయపై జక్కన్న రేంజ్లో సుబ్బిపేరు చెక్కడం.
అరిసెలు చేసేవేళ ఆదమరచి వాటికి ఆవపోపు పెట్టడం…అంతా ఒహటే కoగోళీ!
ఇహ లాభంలే సుబ్బిని ప్రేమ బూరెలబుట్టలోకి దింపాలని దీక్షబూని..ఆవిధంగా ముందుకు పోయి…పోయి…తన మనసులో మాటని తడిబియ్యం ఆరేసినంత శ్రద్ధగా సుబ్బి ముందు పరిచాడు ఆచమానం.
సుబ్బి ఆచమానం నోట ప్రేమమాట వినగానే….మరిగిన నూనెనిచూసి భయపడే చల్లమిరపకాయిలా…అమానుదస్తా గూటంకింద పడి నలిగిపోవాలా అని భయపడే ఏలాక్కాయిలా….నేతికోసం చిల్లు పెట్టించుకునే పూర్ణం బూరెలా భయపడింది సుబ్భి…
కానీ సాతాళిoచిన శనగలఘాటుపోపుకు…ఉక్కిరి బిక్కిరి అయ్యి…మెల్లగా లోలోపల సంబరంతో..పై పైన బెట్టుతో పదును చూపని తీగపాకంలా ఆచమానాన్ని ఏడిపిస్తూ వినోదం చూస్తోంది.
కాలం ఇలా సాగి సాగి…
మొత్తానికి వంట కుటుంబంలో ప్రేమ సువాసనాలని ఏకగ్రీవంగా పొదిగింది.
ఇంతకీ ఆచమానం పెసరట్లప్రేమ.. బొబ్బట్ల ప్రేమగా మార్చిన వైనం భలే వినతగ్గదే!
అదేవిటి అంటే…
“లేదురా అబ్బాయ్…ఏ కార్యక్రమానికి ఆవంట..
ఏ కూరకాపోపు..
ఏ స్వీటుకా పందార అమరినట్టు ఏ వయసుకి ఆ ముచ్చట..ఉండి తీరాలి…నువ్ వెయ్యిచెప్పు..లక్షచెప్పు ఆడకి మగా…మగకి ఆడా…. తోపూ…పూర్ణంలా కుదిరితే అందం..చందం!
ఎంతసేపూ కత్తిపీటలా దగ్గరకొస్తే కోస్తా అనేలాకంటే….
చెరుకుపానకం గారె తో అన్నట్టు దగ్గరకొస్తే మనసు తీపిచేస్తా అనే లక్షణమైన సులక్షణం జన్మకు ఓ అర్ధం,పరమార్ధం తెచ్చిపెడుతుంది.
నన్నేచూడు…అప్పట్లో ఆవపులిహోర బుట్టలా ఘాటు ఉండి…ఒళ్ళూ..పై తెలీక.. అందం..చందం… పొడుగు జడా…సొట్ట బుగ్గలూ….లేత అరిపాదాలూ….బూరె బుగ్గలూ భోషాణo అంటూ…లేనిపోని ఊహాలు పోగేసుకుంటూ…….నేనే గొప్ప….వచ్చేది పడుండాలనే అహంభావం ఒంటికీ,కళ్ళకీ పొరలా కప్పుకొని….కూడాపడ్డ పిల్లని కాదని..జీవితానికి ఏరుచీ పేచీ లేకుండా చేసుకు బతికిఉన్నా!
బంగారానికి గోడ చేర్పులా…జీవితాన్ని నువ్ పంచుకోడం కాదు…నిన్ను నమ్మిన పిల్లకి పంచిపెట్టాలనే ఇంగితం ఏడవాలిరా!
నాకుతెలిసి సుబ్భులు బంగారం దానికి నువ్వో గోడచేర్పు…
ఇహనీఇష్టం…
నువ్ ఊ అంటే పప్పన్నం నేనే వండి వడ్డిస్తా…ఆలోచించు”
ఇదీ గణేశo ఆత్మీయపు పలుకు!
ఈమాటలు ఆచమానం మనసుమీద ఎలా పంచేశాయోలేదో తెలీదు కానీ….
పూర్ణాలకు బూరుగుపల్లి బెల్లం కోరుతూ…గణేశo చెప్పిన మాటలు పెద్ద గుండిగచాటునుండి మనసుపెట్టి వింటున్న సుబ్భులు మనసుమీద మహా మంత్రంలా పనిచేశాయి!
అందుకే…
“బంగారం… నువ్వుండగా… పసుపుకొమ్ము చాలునంటూ” బెట్టు..భయం గాడిపొయ్యిలోకి విసిరేసి ఆచమానాన్ని పెళ్లాడింది సుబ్బి!
అంతేనా…
“అయ్యా…గణేశా…మీ బంగారానికి నేనే గోడచేర్పుని…తెలుసుకోండి..” అంటూ….జడ ఎగరేసి
చక్రపొంగలిమీద జీడిపప్పూ…కిస్మిస్ చల్లుతూ వయ్యారాలు పోతోంది… పోతూనే ఉంది..
జిలేబీని పాకంలో ముంచుతూ ముసిముసి నవ్వులు పోతున్న ఆచమానానికి కొంటెకన్నుగీటుతూ..అతని భార్యామణి శ్రీసుబ్బలక్ష్మి.
****************
“కూచి”
చిత్రకారుడు
:4"రెమిడీ కొరడా":
“ఏవిటీ ఆ ఒహాయిత్యం ఇప్పుడు అది ఎందుకూ… కొంపదీసి చారులో బెల్లం వేసీశానని నా నడ్డిమీ చ్చంపేస్తారా…!!అసలు..అమెజాన్ వాడు దీన్ని కూడా అమ్ముతాడా..ఏవిషీ…ఖర్మ?!?!”
చుడీదార్ వేసుకున్న బామ్మలా బంగినపల్లి బుగ్గలు తెగ నొక్కుకుంటూ మొగుడు సుందరశివుణ్ణి నిలదీసింది పెళ్ళాం అమ్ములు!
‘భస్మాసురుడు అసలు ఈ వరాన్నే ఎందుకు అడిగాడో భడవ…’అనే
సదాశివుడి లుక్కుతో “అమ్ములుశివుడు” తనముద్దుల పెళ్ళాన్ని ..క్రీగంట ఓచూపు చూసి..ఆనక ..అమెజాన్ లో…తను బుక్ చేద్దామన్న “కొరడా”ని అమాంతం బుక్ చేసీసీ…గమ్ముని ఉండి…ఆనక స్థిమితపడి…
‘పద..కాఫీ తాగుతూ చడా మడా మహాడేసుకుందాం ఈ విషయంపై..’అంటూ అమ్ముల్ని పొదవి పట్టీస్కుని వంటింటి వైపు తీసుకెళ్లాడు శివుడు!
కాఫీ పెడుతోంది అమ్ములు..ఈలోపు కాఫీపొడి,పందారా..అమితాబ్బచ్చన్ చెంచా గట్రా అందిస్తున్నట్టుగా నటిస్తూ అమ్ములు వెనకచేరి… ఆమె నడుం అందుకుంటూ..
ఒంటిజడని ఇసుంటా తప్పించి మెడవాలులో నెమలీకపడ్డట్టు ముద్దాడాడు శివుడు.గింగిరాలు పోతోంది అమ్ములు…ఇది భలే హాయ్అనుకుంటూ…!
మళ్లీ ఏదో గుర్తొచ్చి..
“ఇంతకీ కొర..డా…?” అంటూ…పందార సరిపోయిందోలేదో అని ఓ గుక్క కాఫీ రుచి చూస్తున్న అమ్ములు పెదాల్ని అమాంతం తన పెదాలతో చెరబట్టి..కాఫీఔపొసన పట్టి..
“మరే..తీపి సరిపోయిందే మిఠాయి కొమ్ముఅమ్ము….” అనేశాడు శివుడు!
ఈ రోజువారీ భాగోతం అలవాటైన అమ్ములు…”ఇది సరే..కొరడా సంగజ్జెప్పరూ… “అని మరో వేడి గుక్క శివుడికి అందిస్తూ…గోముగా చూసింది!
సరే..ఇంత కాఫీ పోసిన భార్య ముద్దు తీరుస్తూ… ఆమెగారి మొహాన గుండ్రాళ్ళు… గుండ్రాళ్ళు తిప్పాడు శివుడు.
**********************
“ఏమేవ్..
రాహుకేతువులుదంపతులై సంగీతం మాస్టర్లుగా రూపం ఫిరాయించి..మన పక్కింట్లోకి దిగబడ్డారట…హు!”
మహారాజపురం ఆయాసం అంత రొప్పుతూ..వచ్చి సోదెమాంబ చేతనున్న ఆబుగారా లోని నీళ్ళని ఆసాంతం పీల్చేసి,కూసిన్ని నీళ్లను మొహాన్ని జల్లెస్కుని.. అరుగున ఛతికిలబడి…సేద తీరుతూ అన్నారు పరాంకుశం మాస్టారు!
“ఏవిటీ..వెంకుపంతులు గారి కోడలు..సంగీతానికని వెళ్లి…మూడ్రోలకే తిరుగుటపా పట్టీసి… ఝడుపు మంత్రం వేయించుకున్న స్థితికి తెచ్చిన ఆ సంగీత దంపతులా ఏవిటీ వీళ్ళు..ఖర్మ!”
విషయం నషాలానికి ఎక్కి..భర్త తాగిమిగిల్చిన ఆబుగారా నీళ్ళని తానూ ఓ గుఖ్ఖ తాగి విస్తుపోతూ అడిగింది సోదెం!
“ఖర్మ..ఏవిటీ..మహా ఖర్మ!!దుష్కర్మ!!ఆ…ఇహ మనకి మూడిందిలే!”
ఏంచేస్తాం.. “విదిభలీయం”అనే అసందర్భపు ఒత్తులు పెట్టిన మాటలనేస్తూ… భార్యతోసహ అసహనంగా ఇంట్లోకెళ్లి తలుపులు బిడాయించుకున్నారు పరాంకుశం…! మూసుకోడానికి
చెవులకు తలుపులు పెట్టని బ్రహ్మని బెమ్మా0డమైన తిట్లు తిట్టేస్తూ!
విన్నంతనే…వారూ..వీరూ అని లేకుండా అందరూ అమాంతం తమ వలువలొలిచేసుకునేంత కర్ణకఠోరంగా పాటలు పాడి..
ఇల్లు-వాకిలీ, వీధీ-మొగా,ఊరూ-వాడా,స్వరాష్ట్రం-పక్కరాష్ట్రం,
మనదేశం-ఇతర దేశం అనే ఏవిధమైన మొహమాటాన్నైనా పక్కనుంచి,
ఎస్సెమ్మెస్సూ,వాట్సప్పూ ,
యూట్యూబు,ఇంస్టాగ్రామ్,ఫేస్బుక్కూ,ట్విట్టరూ…క్లబ్హౌస్..గట్రాల్లోకి పాటల పందికొక్కుల్లా దొల్చుకు దూరిపోతున్నారు..జనాలకు పాటల సునామీ సున్నిపిండి రాసేస్తూ ఆ గాయకకీచకులు!
ఉన్నపనేదో చేసుకోక… దానికి మసాలా మెకోవర్లు ఎందుకో జనాల ప్రాణాల్ని పీచుమిఠాయిలా చప్పరించేయడానికి కాకపోతే…!
ఒకమాటమాత్రం చెప్పుకోవాలి!
వీరిద్దరినీ నేర్పుగా ఓచోట చేర్చిన బ్రహ్మ నేర్పరి కదా అని మెచ్చీసుకోవాలి!
ఎందుకంటే…
నిలబడ్డ డోళ్లు మాదిరి .. ఇద్దరిదీ ఒకే రూపు!
అప్పుడే నిద్రలేచి గౌడుగేద గొంతుకుల్లా ఇద్దరిదీ ఒకే స్టోను!
ఎట్లనిన…
పాడాలనే మూడ్ గొంతులోంచి మూసీలా పొంగగానే.. సెల్ ఎక్కుపెట్టి ఎంచక్కా అక్కడే ఉండి…నీటి ఏనుగులా మెడ తిప్పేస్తూ పాడేయడం,
తమ బ్యాగ్రౌండ్లో…వార్డ్రోబ్ ఉండనివ్వండి…దండెం మీద ఇన్నర్ విషయాలు ఆరేసి ఉండనివ్వండి,
పనిమనిషి ఇల్లు ఊడుస్తూ కనపడనివ్వండి….ఏదేలా ఉన్నా…”మా పాట మా ఇష్టం…పాటతో మిమ్మల్ని ఏమైనా చేస్తాం” అనే బీభత్స ధోరణితో వారి పాట వారిష్టం!
ఇహ అసలు పాయింట్లోకొస్తే..
ప్రేక్షకాళి మెచ్చిన వండర్ సాంగ్స్ వారి టార్గెట్!
అటు త్యాగరాజైనా..ఇటు మైకేల్ జాక్సన్ అయినా ,
అటు తెలుగైనా-ఇటు కొంకిణీ ఐనా భాషకి నో బౌండరీ,
ఏపాటైనా వారినోట ఈనమోపుల గేద అరుపే!
మదించిన వారి సంప్రదాయపుమ్యూజిక్ మేజర్కులలో ఎవరి రచనైనా,ఎవరి మ్యూజిక్ ఐనా చేతకానివాడి చేతిలో చిక్కుబడ్డ సమోసా బఠాణీ రగడే రగడ!
ఘంటసాల పాటని పృథ్విరాజకపూర్లా,
సుశీలమ్మ పాటని దంపుళ్ళపాటలా…
పాడేయడం వారి జమిలి నైజం…!!!
అరే…శృతి హాసన్ ఐటమ్ సాంగుని సువర్ణసుందరి అంజలికి పాడిపెట్టినట్టూ..
ఎస్పీబాలు పాటని ఈలపాట టెంపోకి బదలాయించినట్టూ..ఏం మనోఅధర్మం వీరిది!
అసలు వాళ్లెం చేస్తున్నారో..వాళ్ళకి చీమతలంతైనా తెలిసి చచ్చిందాని!
ఎంసేపూ..కుక్కతరివినట్టు పాడేయడమేనా..వెనకా ముందూ ప్రేక్షక సచ్చినోళ్లు ఏమైపోతారో అనే ఇంగితం ఇసుమంతైనా ఉండొద్దూ పాడుకుంకలకి!
సిగతరగా… రెగ్గులర్ కాక పండగ స్పెషల్స్ ఒకటీ మధ్యలో ప్రేక్షకుల ప్రాణాలకు.. ధమాకాయ్ సేల్ లా..!
వేసవిలో చలికోటూ బిగించడం,వర్షాకాలంలో ఇంట్లో గాగుల్సూ తగుల్చుకోవడం…లాంటి నావెల్ దిక్కుమాలిన ఐడియాలతో ఆ దంపతుల “సోషల్ మీడియా పాటల వ్యవహారం జనాల కంటిమీద కునుకుని లాగేసి… చక్కా గోడఅవతలకి విసిరిపారేస్తోంది!
ఇహ వారి గాత్రంమీదా,వారిదేహపు మెకోవర్ మీదా వారికున్న జిల మాట దాటి..
వాళ్ళ “సోమీ”ఫాలోయర్స్ ఒకళ్ళూ…పిల్ల సన్నాయిల్లా…!!
లైకుల్ని ఆవిరి కేకుల్లా ఇచ్చేయడం కాక…..
“పాడేడప్పుడు మీ మొహం అచ్చు వాహ్!మేంగోమూడ్ మేడమ్!”
“సారూ!భలేపాడారండీ ఏంటీవోడి పాటని రాజబాబు గొంతుతో!”
“అసలు కారణజన్ములు మీరే!నెక్స్ట్ నోబెల్ గాత్ర బహుమతి మీకే జమిలిగా!”
అంటూ….15674389043 లైకుల కేకులొకటీ ప్రయాణానికి!
అన్నిటినీమించి వారు ఆ కాలనీలోకి రావడం…. కరోనా పాదం మోపడం అదో అద్వైతంలా ఒకటే!
వాళ్ళింట్లో వాళ్ళు తాళం వేసుకు పాడుకుని చస్తే..మేం బయట తాళంవేసుకు చద్ధుo!
అలాక్కాదే..వీళ్ళగోల…
ఎదో శకుంతల వనవిహారానికి, విప్రనారాయణుడు డాబా మీదకి వెళ్లినట్టు వెళ్లి… చీరకట్టుతో ఆవిడగారు…
“నా జీనూ ప్యాంటు చూసీ మాయ్యో!”అనీసీ…!
“ఇప్పటికింకా నా వయసూ నిండా ముప్పియ్యారే!” అంటూ ఈయనా.. పాడేస్తూ..చుట్టుపక్కలవారికి చుక్కలు..గ్రహాలూ చూపిస్తున్నారు!
వీరి పాటతో కాలనీకి మహా డెంగ్యూ తెప్పిస్తున్నారు..!!
మైకు ముందు దోమల్లా వీళ్ళిద్దరూ!
ఆవైనం అందరిలో ఎక్కువ కనపడుతున్నా…మరికాస్త ఎక్కువై వారి పక్కింట్లో ఉన్న పరాంకుశం దంపతులలో మరింత ఎక్కువ కనిపిస్తోందీమధ్య!
పరాంకుశం గారు..ప్రొద్దుటే లేచి మొహం కడుక్కుని “చందమామరావే..జాబిల్లి రావే” అని గిలాక్కాయి పట్టుకుని పంచె ఎగ్గట్టుకుని గంతులేయడం!”
“ఏవండమ్మగోరూ…అంట్లు తోమడానికి మీ పట్టు రైక ఇవ్వరూ”!అని పనిమనిషి అడగడం!
“టమోటా తో వేపుడా… స్వీటా..ఏంచెయ్యమంటారు..లేదా కరివేపాకు బిర్యానీనా…”అంటూ సోదెo!! అందరూ కలసి
వెర్రెత్తిపోతున్నారు!!!
వారి పాట ఇంకా ఎన్ని అనర్ధాలు తెస్తుందోని భయపడుతూ…
ఏమైపోతామో అని వణికి చస్తున్నారు.
ఇలా చస్తూ…ఓసారి అలా ఊరేగబోతూంటే…
“ఝడుపులకు..జ్వరాలకూ..కనపడక పీడించే ఈతి బాధలకూ సులేమాన్ ఖాన్ సిద్ద వైద్యం!తగ్గించకపోతే జబ్బు వాపస్!”
అనే బోర్డు చూసి పరాంకుశం దంపతులు…అక్కడికెళ్లి…
ఒకటే గుస గుస గుస..
ఆపై ఒకటే నసనస నస…
ఆపై ఒకటే భోరు భోరు భోరు…
సులేమాన్ కూడా వెక్కి వెక్కి
ఏడిచేలా!
విషయం తెలిసిన సులేమానుడు…కళ్ళనీళ్లతో బాహా తడిసిన… గెడ్డం..మా బాహా తుడుచుకుని…పరాం చెవిలో దూరి “దివ్యోపదేశం” చేసీసి రొండొoదలు రొంటిలోకి నొక్కేసి చూస్తూంటే…
“ఐతే..వీరి సంచలన..కర్కోటక.. గాత్రానికి విరుగుడు… అదేనా..ఏవిటీ…దానితో పరగడుపున తలో 11 పీకులు పీక్కుంటే సరన్నమాట..అంతేనా బాబూ!” పరాం మాటకి అడ్డొస్తూ..
“అంతేగందా…”
ముక్తాయించాడు సులేమా..!
అంతే… పరాంకుశం అక్కడి నుంచే అమాంతం మేనల్లుడు శివుడికి సెల్లెసేసి… సులేమాన్ చెప్పిన రీతిలో బాహా వెదకి… ఓ దిట్ఠవైన.. వాటవైన “కొరడా”ని అమెజాన్లో ఆర్థరిచ్చి తన అడ్రస్కి పంపమన్నారు యమార్జన్ట్ గా…!
*********************
ఇదీ అసలు సంగతని అమ్ములు ముందు కూర్చుని కడుపులో ఉన్న కొరడా గాథని..కొసరంటా కక్కేశాడు శివుడు!
విస్తుపోయేసిన అమ్ములు
“అది సరేనయ్యా స్వామి…మీ మావయ్య, అత్తయ్యలకు ఒక్క కొరడా చాలు కదా..ఆ గాయకకాకుల అరుపుల్నించి కాపాడేసుకోడానికి…
మరి ఆ రొండోది ఎందుకూ…?”అంటూ సతాయిస్తున్న అమ్ములు చెవిలో.. పరాంగారు చెప్పిన అసలు రహస్యం కూడా ఆగలేక చెప్పేశాడు శివుడు…!
ఆ విధి విచిత్ర విశేషం ఏమిటని…
“ఊరంతా ఈ గానప్లేగు వ్యాపించేలోపు..వారిని ఆ ఊరినుంచి శివుడి ఊరుకు పంపడానికి ఐక్యరాజ్యసమితి రేంజ్ లో ప్రయత్నిస్తున్నారట పరాం ఊరి జనాలు!
అదే గనక నిజవైతే…ఆ “గాయకద్వయం” తమ ఊరుమీద అమాంతం పడుతుందనిన్నీ…పడ్డం పడ్డం..శివుడి ఇంటిపక్కన వారూ ఈమధ్యనే కొనుక్కున్న ఇంట్లో పడుతుందనిన్నీ..”వివరం!
అలాగైతే తమకోసం కొన్న కొరడా ఎట్టి పరిస్థితుల్లోనూ పాడౌతుందనిన్నీ…ఇంకో కొరడా మీకోసం ఆర్డర్ చేసుకొండనిన్ని పరాం చెప్పిన ఇంకో సారాంశం!
అంతే…..ఆపళాన…నేత్రాలుతిరిగిన అమ్ములు మొహాన..నీళ్లుకొట్టి మూర్ఛ తేల్చడం సుందర శివుడి పనైంది.
“కూచి”
చిత్రకారుడు
”రాలి లో జాలీ -21”
“చెప్పండి ధర్మం!
చెయ్యండి న్యాయం!
నోరులేని మూగజీవాలమీదా మీ కొరడా!
ఇది చరిత్ర క్షమించని నేరం!
దైవం ఒప్పని ఘోరం!”
సన్నీ గుండెలవిసే వేదనామయ వాదనకు కోర్ట్ హాల్ నోటిమీద వేలేసుకున్న నిశ్శబ్ద.
……………………….
“ఐతే ఈ డీల్ ఓకే అంటావు…మరికొద్ది గంటల్లో క్లోజ్ అంటావు…మరి పైసలకి పర్లేదా చైతూ…?”
సాలోచనగా అంది చైతూతో సన్నీ…అమెజాన్ సైట్లోపడి కొట్టుకపోతున్న అతడి తీరు చూసి.
“అదేగా నేను చెప్పేది…మమ్మీ ఈసారి కొంచెం బడ్జెట్….నా పుట్టినరోజు కంటే ఎక్కువ వేసింది నీ ఏటీఎం లో…ఛలో… డౌట్ వద్దు…ఇదికూడా కార్ట్లో వేస్తున్నా నీ కోసం…!”
చైతన్యగోవిందు మాట సన్నీ కి భరద్వాజవిందే!
కన్నతల్లి ఎవరో తెలీపోయినా… కన్నతండ్రి వీడే సుమీ అన్నట్టు చైతన్య సన్నీని గుండెల్లో పెట్టుకు చూడ్డం కాలనీ కళ్ళ వాళ్లకు కంటగింపే మరి.
వాడెప్పుడు నిద్రలేవాలి…వీదిగుమ్మం లోకి వచ్చి ఎలా శరీరాన్ని లొట లొటలాడించాలి…ఏ యాంగిల్లో ఒళ్ళు విరుచుకోవాలి…నుంచి…రాత్రి ఎటుతిరిగి తల పెట్టుకు పడుకోవాలనేది డిక్టేటర్ చైతూ అదుపు ఆజ్ఞల్లో సన్నీకి యమా కంఫర్ట్.
ఇక పడుకునే పక్కబట్టలనుంచి…
తొడుక్కునే బట్టలదాకా… ఆడుకునే బొమ్మలనుంచి…
వాడుకునే తిండి బొచ్చెలుదాకా అతని కనుసన్నల్లోనే.
ఇక సన్నీ “బాడీకేర్” కి చైతూ తీసుకునే శ్రద్ధ…స్వాతిముత్యం “వటపత్రశాయికీ…”సాంగ్ రేంజ్.
ఐతే అక్కడ రాధిక,ఇక్కడ చైతు…అక్కడ పాపాయి….
ఇక్కడ సన్నీ నామధేయడు…ఇంటి పెంపుడు భైరవుడు!
ఎందుకో సన్నీని కుక్క అంటే చైతుకు తిక్క.!
అందుకే సన్నీని “వాడు”గా ప్రపంచానికి పరిచయం చేశాడు.
వాడు అందం!
వాడు అలిగాడు!
వాడికి కావాలి!
వాడు పళ్ళుతోముకున్నాడు!
వాడికి బొమిక ఇవ్వాలి!
ష్..వాడు నిద్రపోతున్నాడు!
ఇలా”వాడు”వాడుక వాళ్ళింటి వేడుక…ప్రోటోకాల్!
ఇష్టంలేకపోయినా “వాడు”కరుస్తాడేమో అని సుప్రసన్నం చేసుకోడానికి చైతు ఇంటికొచ్చే ప్రతి”వాడూ”….”వాడు”ను వాడి బ్రతుకు జీవుడా అనుకుంటారు మరి.
ఇంతకీ అప్పుడప్పుడు పలకరించేడప్పుడు “వాడు” పదం పడక…కుక్క అని నోరుజారే అపశృతి పడిందా…అంతే సన్నీ వొంటి బొచ్చు తుపానులో రెల్లులా లేచి ఊగుతుంది.కళ్ళు ఎర్రసిరాలో ముంచిన పత్తికాయలవుతాయి.
నోరు త్రిబుల్ డోస్ బర్గర్కి తెరువబడ్డ..నోరవుతుంది అందులోంచి స్టీలమ్మమొగుడిలా మెరిసే కోర దంతాలు పాలపుంతల నక్షత్రాల్లా మెరుస్తాయి.
సన్నీ ఒక్క అడుగు వెన్నక్కివేసి…ఎండలో గేదె లా ముందుకు వెనక్కు ఊగి…రెట్టించి దూకుతుంది…!
కట్ చేస్తే…అంబులెన్స్ ఉలిక్కిపడేలా కేక… పిక్కమీద సన్నీ వేసిన ఎర్రని పళ్ళ టాటూ!
ఇదీ తంతు.
కుక్కని కుక్క అంటే పౌరుషం సుర్రని పొడుచుకు వచ్చి “వాడు” అననివాడి కాలం మూడినట్టే!
“ఎంతైనా ఖర్చుపెట్టి…కరచిన కాలును రిపేర్ చేయిస్తా…కావాలంటే గేటెడ్ కమ్యూనిటీలోని ఓ రెండు ఫ్లాట్లని అమ్మి ఫైన్ కడతా…కానీ మమ్మీ.. సన్నీని “వాడు” అనని వాణ్ణి నే క్షమించ..ఆ..!”
చైతు మాటకి క్రెడిట్ కార్డిచ్చి మరీ భుజం తట్టింది తల్లి…బీపీ టాబ్లెట్ ఇంకో ముక్క మింగుతూ!
ఇగో ఆ సపోర్ట్ ముదిరి జరగరానిది మరోసారి జరిగింది.
అనుకుని..ఇంటికొచ్చిన “నరేన్” గాడు చైతు పెట్టింది తిని వెళ్ళొచ్చుగా..ఊహూ…
వెళ్లకుండా….
“ఐతే అబ్బాయ్.. నీ కుక్కకి ఏబ్రాండ్ తిండి పెడతావ్…అమెరికా మైఖేల్స్ నుంచి గమ్మీ బోన్స్ ఎన్ని తెప్పించావు ఈ సన్నీ కుక్కకి…అంటూ ఒకటికి పదిసార్లు కుక్క కుక్క అనడంతో…
ఇంజన్లో మంట భగ్గునగా.. చైతు వారింపు చూపులు లెక్కచేయక “సన్నీ వాడు”…నరేన్ మీదకు కుప్పించి,ఎగసి దూకి…అతని పిక్కని చక్కా పీకేశాడు కసి దీరా…!
అంతే…హైద్రా లో నరేన్ అరచిన అరుపుకు… ఎక్కడో తిరుమల రాజగోపురం మీద.. మధ్యాహ్నం తరిగొండ ప్రాంగణాన సుష్టు గాతిన్న అన్నాయాసం ఇబ్బందితో… మగతలోకెళ్లిన అశేష పావురం ప్రపంచం బంధుమిత్ర సపరివార సమేతంగా అమాంతం గాల్లోకి లేచి కకావికలయ్యాయి.
కొంత గట్టి గుండె కనుక…స్వామి సన్నిధిలో ఉన్నానన్న ధైర్యం ఉందికనుక…గరుడుడు…రెక్కకూడా కదపకుండా…కిమ్మన్నాస్థి గా ఆనందనిలయంలోంచి కదల్లె!
సదరు స్టీల్ పళ్ళ
సన్నీ కొరికిన కొరుకుడుకు నరేన్… మనసా పూనకంతో ఊగి…మణిశర్మ సమరసింహారెడ్డి బాలయ్య పాటతో మరింత పూనకం తెచ్చుకుని ..కోర్టుకి ఎక్కాడు కోటు వేసుకోకుండానే!
“ఇందుమూలముగా సన్నీ స్టీలు పళ్ళ బాధితులు ఎవరైనా వచ్చి పిర్యాదు చేస్తే…దాని పీచమనచడానికి మేం సిద్ధమనే శ్రీ కోర్ట్ వారి మాటను కౌంట్లోకి తీసుకుని కాలనీలో కొన్ని కడుపుమంట కుటుంబాలు పంచె ఎగగట్టి…దాస్టీకం చేస్తూ…
“ఎబ్బే మమ్మలి కరవలే… కానీ ఒహవేళ ఊగ్రం వచ్చి కరిస్తే…”అనే పాయింట్ కూడా రైజ్ చేయబోయారు..కానీ..
“అవటా…సాక్ష్యం లే…ఉట్టిపుణ్యాన కోర్ట్ విలువైన సమయాన్ని పీచుమిఠాయిలా తినేసే మీకు తలకో వెయ్యికేజీల టమాటాలు అపరాధ జుర్మానా అని శ్రీ హుకుం వస్తే ..బతుకు వరదల్లో మూసీ అవుతుందని…భయపడి.. ఎగదోసిన పంచని చక్కా కాళ్ళకిందకు లాక్కుని…
ఇస్కూల్కి వెళ్లే పిల్లాళ్లలా జనం జయప్రదంగా వెనక్కి తగ్గారు.
కానీ నరేన్…పాపం నరేన్…కోర్టులో వాదప్రతివాదాలకు ఖిన్నుడై…ఒకచో చేష్టలు ఉడిగి…అన్నీ మూసుకుని కోర్ట్ మెట్లు దిగిపోయాడు పరుగులాంటి నడకతో!
ఇంతకీ సదరు వాదోప వాదాల్లో… సన్నీ కోర్ట్ శ్రీవారికి విలపిస్తూ విన్నవించుకున్న విషయం ఏవిటీ అంటే…
“ఆర్యా…గౌరవనీయా…
తను తిన్నా.. తినకపోయినా…
తన సైజుకి కావలసిన బట్ట ఎక్కువరేటు ఉంటుంది కాబట్టి తక్కువ ధరలో చిన్నసైజ్ బట్టలే కొనుక్కుని..తొడుక్కునే నా యజమాని శ్రీ చైతు సర్…నా వంటి పోషణలో ఆవగింజంత అపరాధం చెయ్యలేదు.
ఉదాహరణకి…నేను ఇలా అనలేను.. సాటి వాటి మనోభావాల్ని తుంగలో తొక్కలేను…కానీ అనక తప్పట్లే…సాటి కుక్కలకు దక్కని భోగ భాగ్యాలు నాకు అందించిన “బ్రో” మా చైతు.
ఉదాహరణకి మళ్లీ చెప్తున్నా…డబ్బుకాలిపోయినా సరే…అమెరికా “టార్గెట్” నుంచి నా దంత సంరక్షిణిని నాకు కావాల్సిన ఫ్లేవర్లో తెప్పించి..నా దంత సంరక్షనే తన జీవిత సోపానంగా మలుచుకుంటానని..
డాలర్లకు లెఖ్ఖ చేయక… ఆఘమేఘాలమీద “గరుడవేగ” లో ఆ దంత సంరక్షిణిని ఇండియాకి రప్పించి…కష్టమ్స్ కి డబ్బు రక్తంలా ధారబోసి…..
చూడు సన్నీ వాడూ… సులక్షణ మైన హెల్దీ పళ్ళతోనే ఎదుటివారిని పీకు…ఆనక వారికి ఏ సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రాకుండా ఈ క్రీమ్ వాడు…కే!
సమాజంలోని పిక్కల పట్ల మనకున్న వాటమైన బాధ్యతకు ప్రపంచం ఫిదా అవ్వాలి…కోర్టులు ఈ హెల్దీ కొరుకుడు మెషర్స్కు హాశ్చర్య పోవాలి… సంఝే….”
అంటే కరిగి ప్రవహించి.. నా యజమాని నా పట్లా..నా పళ్ళ పట్లా.. విశేషించి సమాజపు సాటి సంఘజీవుల పిక్కలపట్లా చూపిన అసమాన శ్రద్దని కొలిచే తూనిక రాళ్ళూ…దీన్ని విపరీత క్రైమ్ అని నిందించే నోళ్ళూ ఉంటాయా…మీ పక్కనున్న త్రాసు బొమ్మ నెత్తిన ఒట్టుపెట్టి చెప్పండి..
ఇది సబబేనా..
ఇది తప్పేనా…
ఇది శిక్షార్హమా…
ఇది పాడియా…!”
సన్నీగాడి వాగ్ధాటి సోషల్మీడియా లైవ్ లో అక్షాoశాలూ…రేఖాoశాలు కలిసిపోయేలా గ్లోబ్ ను ఊపేస్తున్నాయ్.
న్యాయమూర్తి మనసు కాంగోళీ అయ్యి ఆనక తీర్పు వచ్చింది.
“….ఎంతో వ్యయ ప్రయాసలకు తట్టుకుని,
అంత మహత్తరమైన పేస్ట్ తెప్పించి వాడించి…ఆ ఆరోగ్యమైన పళ్లతోనే సన్నీ వాడితో వాడిగా కొరికించడంలో చైతుకు ఏ దురుద్ధేశ్యం లేదు గాగ లేదు.
ఇంకా ఈ చైతు శ్రమ…మరియు సన్నీ ఆరోగ్యకరమైన ప్రికాషనరీ మెజర్స్ లోకానికి ఆదర్శం కావాలంటూ.. ఇలాంటి తప్పుడు అభియోగం తో వచ్చిన..నరేన్కు మరో
పదకొండు సన్నీ వాడి కాట్ల శిక్షవేస్తూ..సన్నీని..క్షమిస్తూ..చైతుకు ఆ దంతమంజనం దిగుమతికి కష్టమ్ సుoఖం వెయ్యవద్దని ప్రభుత్వాలను హెచ్చరిస్తూ….స్వస్తి!!”
చైతు సన్నీవాడిని సాలోచనగా అభినందిస్తోo డగానే….సదరు కోర్టు తీర్పు అమలవ్వుతోంది అనే గుర్తిగా….
మళ్లీ నరేన్ కెవ్వుకేక! ఈసారి కోర్ట్ కిటికీలోంచికూడా పావురం కుంకలు ప్రాణభయంతో గాల్లోకి ఎగిరి పారిపోయేలా!
*********
“కూచి”
చిత్రకారుడు.
"కొమ్మాహారం":
తొక్కలో రుచులు-బొక్కలో వంటలు గ్రూప్
…….
ఓం అత్తిరి బిత్తిరాయ నమః
……….
సోల్లుకార్చుకునే నాలికలకు ఈ వీడియో అంకితం…..
ఈ రోజు మా “గెరిట-గిన్నీ” సామూహిక సభ్యుల కోరికపై..
జీవితం నీ రసవంతం చేసే…ప్రత్యేక రుచికర వంట!
*****************
“రసగుల్ల ఉల్లిఖారం పప్ఫ”
మీ స్పందనే మా పొట్టకు ఆయుష్హు
జై కకుంభరీ దేవ్యాయ్ నమః!
#########
“కిలో బుట్ట బోయనం”…
గరిటే లేకుండా 300రూప్యంస్…!
ఇది వెల…!!!
జై హితాయ!నమః!!
###########
జీవితం మాలోక చంద్రం,హృదయాయ నమామి…
…. ………………..
“రసగుల్లా ఉల్లిఖారం పప్పు”
తయారీ విధానం:
“మీ ఇంట్లో బొచ్చెలెన్నున్నాయో తెలీదు
అందులో ఓ మీడియం బొచ్చె పొయ్య స్టవ్ మీద పెట్టండి.
శ్రీమాన్ రామాయ కనికరించు..!
………
ఇది మా చికాగో మనవడికి (ఇంకా అన్నప్రాశన అవ్వకపోయినా)ఇష్టమని పెద్ద అత్త “కూచులూ..డే..డే..డే…” అంటూ ముద్దు చేస్తూ….కొసరి కొసరి పెడుతుంటే మింగేంత ఇష్టం!
మరి ఈ పప్పు వండుకునేందుకు బొచ్చె సిద్ధం చేశారా….
“బలి బలి బలి దేవా…రక్షించుమయా దేవా….!!”
నేను 7 క్లాస్ 4 డిoకీల నాడు మా “బూరావలి” గారిదగ్గర పెళ్ళికొడుకు కి వినిపించడానికి నేర్చుకున్న మాయదారి…తూతూ పాట పైది!
ఓం జయగురు సాయి…నమః
########
మరేమో
బొచ్చె లో… వేళ్ళు కడుక్కుని…అవి మునిగేదాకా … నీళ్లు పోయాలి…పోసి నీళ్లను దోరగా వేయించాలి…. తరువాత….
“”జీవితమే బుడగగా…. ఉదగా …సాగగా….పేలగా
ఇది సమరం…ఓం నమహా……!!
#######
మంచి బాదం పప్పు…మిర్చి…..ఒక వంకాయ ముక్క…ఒకటిన్నర కాఫీ స్పూన్ వంటావదం… గిలక్కొట్టి పచెక్ పచెక్ చేయాలి !ఓం తిరుమల!…..”
#######
#######
మహాప్రభో….ఇలా “fb లో తయారించడం చూపే వంట”…..”ఎగస్ట్రా ఎక్స్ప్రెషన్స్ లెక్కువై”…..తయారించే విధానం మనకి అర్ధమయ్యేనాటికి కడుపులో తిరిగే ఎండుఎలుక…బాహా ముదిరి ఒబేసిటీ పందికొక్కుగా మారి…మన దుంప తెంచి..ధూపం వేస్తుంది.
……జై డింగ్ టకా…త్రియ్యుమ్!
**********
“పాపం..కొత్త రుచి తెలుసుకుందాం అనుకుని…నాలుక బైట వేసి చూసే నాలాంటి తిండి జీవులకు…పైన చెప్పే విధానం…కూచింత ఒళ్ళు… గాడిపోయ్య మంటే…!!
ఓం శాంతి!!
************
అంచేత.”అయ్యా…అమ్మా వచ్చిందేదో చేసుకు మింగ0డి!”
కాన్సెప్ట్ కి తగ్గ విషయం మాత్రం చెప్తూ…వంటల్ని fbలో పరిచయం చెయ్యండి!చాలు!!!
########
మరొక్కమాట! అలానే..
“వంటని వంటగా పరిచయం చేస్తున్న మిత్రులకు..కూచింత మినహాయింపు ఇస్తూ…కృతజ్ఞతలు చెప్తూ…!!!
###
పై రచన ఓ పేరడీ గా….
అచ్చంగా అలాంటి వారిమీదేనర్రో!!!
***********
“కూచి”
చిత్రకారుడు.
ఎఫ్బీ!ఆవిడకు ఆవకాయ డిప్ప!:
***************************
“మొన్న మాఅమ్మగారి ఊరెళ్ళా మా లాలీపాప్ మొగుడితో…!
ఎప్పటిలానే జొన్నరొట్టెలో మిరప నంజుతో..,గ్లాస్ మజ్జిగతో ట్రావెల్ చేస్తూ!
చూస్తే మా పక్కసీట్లో కొబ్బరిపుచ్చెలతో కోటి వ్యాపారం చేసే
కొత్తెo బాబాయ్ ఉన్నాడు!
పరిచయంలో… కలికంకు లేని మా బోడిబొప్పడం మొగుడి విద్యానైపుణ్యం….,
ఇండియాలోనేకాదు,విదేశాలలోనూ వక్ఖ సెలబ్ని కూడా వదిలిపెట్టకుండా మేం తీయించుకుని…ఎఫ్బీ కక్కేసేలా పోస్ట్ చేసిన ఫోటో ఆల్బమ్,… చూపించి…వారితోనూ ఓ ఫోటో లాగించి…కొంచెం అన్నియ్యని చేసుకుని ఆ ఆనందంతో ఇల్లు చేరాం!
ఎఫ్బీ మెగా యూజర్ వచ్చిందని…మావీధికుక్క కూడా తోక లేపి ఆడుతున్న వైనంకూడా నా సెల్లో క్లిక్కింది!
ఇక నా లల్లిపాప్ గాడా…దేభ్యం మొహంతో ఎప్పటిలానే ఉప్పులేని ఇడ్లీనవ్వు ఇకిలిస్తూ…బట్టబుర్రమీద తనకిరాని స్వరాలు మీటుకుంటున్నాడు పిచ్చినా పింది!
ఓ ఎలకనవ్వుతో మాఅమ్మగారి ఇంటిముందు ఆటో దిగా…!
చిత్రం….
అప్పట్లో డైనోసార్ వచ్చినా నే భయపడకుండా…దానితో అక్కచెల్లి వరస కలిపేసుకుని…బోర విరిచిపెట్టుకుని వేసినముగ్గు ఇంకా అక్కడే ఉంది…పక్కన ఉండి చూస్తున్న మొక్కజొన్న కండి స్నేహంతో!ఈ ఫిక్స్ మీకోసం
మళ్లీ పోస్టేస్తున్నా!
అంతేగాక
యారాడకొండంత రుబ్బురోలు లక్కపిడతoత అయ్యేలా నూరి….నే చేసిన రొటిపచ్చడి జాడ…అమ్మ ఇంటి పెరటి మందార చెట్టు క్రింద ఇంకా పదిలంగా ఉన్న ఆనవాలు చూసుకుని తృప్తి పడ్డా!
ఇహ ఆపై మ్యూజిక్అకాడెమీ హాల్లో…నే చేసిన పీహెచ్డీ మీద కవిత చదివి….ప్రముఖ కీ౹౹శే రచయిత వారి పెళ్ళాం బట్టలుతికి …కృతజ్ఞతగా వారి రొండోపెళ్లాం మూడో కూతురి నాలుగో మనవరాలు పెట్టిన పొంగలి తిని…వారికి వినపడేలా బ్రేవ్ మని తేలుస్తూ…’లిటర్న్’అవుతుంటే…
దారిలో మళ్లీ తుంబురగానసభా హాల్ తళుక్కుమంది….!
అయినా..ఇప్పుడు ఇంటికెళ్లి..ఎఫ్బీలో…ప్రియ వెలువిడిచిన అన్నియ్య ధారావాహిక లాగించేకంటే…ఇక్కడ మరో భారీ గురువు కపిత్వం విని… ఆతరువాత…వారిని రాసుకు,పూసుకు తిరిగి…మీ రచనలకు మేము గందభేరుండ సరిసమాన.. తు…ఫానులం….ఫ్రిడిజులమ్ అన్నీసీసి మోహమాటపెట్టి లాక్కున్న సెల్ఫీలతో ఇల్లు చేరాం…!!
ఇంకెందుకాళీశం అనేసుకుని..
మా శ్రీవారి బొప్పడం తల నిమిరేస్తూ
ఆ విశేషాల ఫొటోస్ మీకోసం…ఇవిగో!
అన్నట్టు…దేవుడిచ్చిన కొత్త…బ్రాన్డ్న్యూ అన్నీయ్యా…ఇవిగో ఆ ప్రజ్ఞల ఫోటోవులు నీకోసం కూడా అన్నీయ్యా…మరి గిప్పటికీ శలవా…
ఇట్లు
ఆ…..నీతల్లి….చెల్లి
నీ
మరుమల్లి!”
************
“కూచి”
చిత్రకారుడు